సీనియర్ హీరో ఓవైపు సినిమాలు, మరోవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఇంకో పక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వేగ జ్యువెలర్స్ కు బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన వేగ షోరూంను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా హాజరయ్యారు. షాప్ ఓపెనింగ్ తర్వాత బాలకృష్ణ, సంయుక్త మీనన్ కలిసి ఏలూరు నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ లో తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సంయుక్త తన హీరో బాలయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. బాలకృష్ణ ఒక పెద్దావిడకి నమస్కరిస్తూ మాట్లాడుతుండగా.. సంయుక్త ఆయనకు కనిపించకుండా వెనక నుంచి కాళ్లు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ విషయం గ్రహించిన బాలయ్య వెంటనే సంయుక్త తల మీద చెయ్యి వేసి తన ఆశీస్సులు అందజేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ, సంయుక్త మీనన్ ప్రస్తుతం 'అఖండ 2: తాండవం' చిత్రంలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఏలూరులో నగల దుకాణం ఓపెనింగ్ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లోనూ వీరిద్దరూ సరదాగా మాట్లాడుకోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. బాలయ్య తనదైన శైలిలో మొబైల్ గాల్లోకి విసిరేసి క్యాచ్ పట్టుకోవడంతో, పక్కనే ఉన్న సంయుక్త ఆశ్చర్యపోయారు. ఆమెను కూడా అలా ట్రై చేయమని బాలకృష్ణ అడగ్గా.. తన వల్ల కాదంటూ సంయుక్త నవ్వేసింది. ఈ వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.