అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ.. వృద్ధులకు అండగా కీలక నిర్ణయం.. సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి..

Wait 5 sec.

తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి() అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు కేవలం పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా.. ఐదేళ్ల వయసు వరకు వారికి పూర్వ ప్రాథమిక విద్యను బోధించి నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలని సీఎం సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖలపై మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ కీలక సూచనలు చేశారు. అంగన్‌వాడీల నిర్మాణంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పిల్లల అవసరాలకు తగ్గట్లుగా కంటైనర్లతో డిజైన్ చేయించిన కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. సోలార్ ప్లేట్లు, బ్యాటరీ బ్యాకప్‌తో కూడిన తక్కువ వ్యయంతో ఎక్కువ సౌకర్యాలను అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న కంటైనర్ కేంద్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందించాలని, ఇందుకు ఎన్జీవోల (NGOs) సేవలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. బాలామృతం ప్లస్ ను పెద్ద మొత్తంలో అందించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. కర్ణాటకలో జొన్న రొట్టెలను పౌష్టికాహారంగా వినియోగిస్తున్నందున, పౌష్టికాహార నిపుణులతో చర్చించి, వాటిని మహిళా సంఘాల ద్వారా పిల్లలకు అందించే అంశంపైనా దృష్టి సారించాలని సూచించారు. అంగన్‌వాడీల్లో పౌష్టికాహార పంపిణీ, వాటి పర్యవేక్షణ, నిర్వహణపై వంద రోజుల కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమం విషయంలో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. అనాథ పిల్లలకు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్టే, ఏటీసీల్లోనూ వారికి ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. తెలంగాణ పిల్లలను సింగపూర్‌లోని నైపుణ్య శిక్షణా కేంద్రాలకు పంపే ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో, అక్కడికి పంపే వారిలో అనాథ పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని బస్తీలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి, నిర్దేశిత సమయంలో వారికి పౌష్టికాహారం అందేలా చూడాలని ఆదేశించారు. విశ్రాంత ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు పిల్లలకు బోధన చేసేందుకు ఆసక్తి చూపిస్తే, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణ ఫుడ్స్, విజయా డెయిరీ ఉత్పత్తులను అంగన్‌వాడీలకు అందేలా చూడాలని చెప్పారు. వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంనిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులకు లేదా కుటుంబ సభ్యులు పట్టించుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలవాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఉద్యోగులైతే వారి వేతనాల నుంచి నేరుగా తల్లిదండ్రుల ఖాతాలకు 10-15 శాతం జమ అయ్యే అంశాన్ని పరిశీలించి, సమగ్రమైన నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించామని, వారి సేవలను రవాణా, దేవాదాయ శాఖ, వైద్యారోగ్య శాఖలతో పాటు ఐటీ, ఇతర కంపెనీల సేవల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ 2047.. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌లో చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా, దివ్యాంగుల మధ్య వివాహాలు, వివిధ పథకాల్లో వారికి ప్రోత్సాహకాలు కల్పించే విషయంపై అధ్యయనం చేసి, వచ్చే మంత్రిమండలి సమావేశం నాటికి నివేదిక సమర్పించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమగ్రమైన విధానాలు తెలంగాణలో సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయని ఆశిస్తున్నారు.