తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురిసింది.. జూన్ నెలలో భారీగా ఆదాయం సమకూరింది. తిరుమల వెంకన్నన్ను గత నెలలో 24.08 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.. టీటీడీకి కానుకల రూపంలో రూ.119.86 కోట్లు ఆదాయం వచ్చింది. జూన్ నెలలో సగటున రోజుకు 80వేలమంది శ్రీవారిని దర్శించుకున్నారు. గత నెల 14న అత్యధికంగా 91,720మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. జూన్ నెలలో ఐదు రోజుల పాటూ ఏకంగా 90 వేలకు పైగా.. మరో పది రోజులు 80 వేల మందికిపైగా శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. చాలా కాల తర్వాత జూన్ నెలలోనే అత్యధికంగా ఒక్కరోజులోనే 91వేలకుమందికిపైగా భక్తులు ని దర్శించుకున్నారు.జూన్ నెలలో వేసవి సెలవులు ముగిశాయి.. ఈ క్రమంలో భక్తులు భారీగా దర్శనానికి వచ్చారు. హుండీ ఆదాయం విషయానికి వస్తే.. జూన్ నెలలో రోజుకు సగటున రూ.4 కోట్ల ఆదాయం సమకూరింది. జూన్ 30న అత్యధికంగా రూ.5.30 కోట్లు ఆదాయం వచ్చింది. గత నెలలో 10.05 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జూన్ నెలలో 7వ తేదీన అత్యధికగా 45,068 మంది తలనీలాలు ఇచ్చారు. మే నెల విషయానికి వస్తే.. ఆ నెలలో 23.77 లక్షల మంది .. హుండీ ఆదాయం రూ.106.83 కోట్లు సమకూరింది. దాదాపు గత మూడేళ్లుగా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నెలకు రూ.100 కోట్లకు తగ్గకుండా వస్తోంది.. ఆ రికార్డు కొనసాగుతోంది. ఈ నెలలో 1.19 కోట్ల లడ్డూలను విక్రయించారు.ఘనంగా మరీచి మహర్షి జయంతిశ్రీ మరీచి మహర్షి జయంతి కార్యక్రమం మంగళవారం తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా జరిగింది. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి, అమ్మవార్ల చిత్ర పటాలకు, మరీచి మహర్షి చిత్ర పటానికి మంగళ హారతులు సమర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ వైఖానస శాస్త్రానికి మూలపురుషుడైన శ్రీ విఖనస మహర్షి శిష్యుడైన శ్రీ మరీచి మహర్షి విమానార్చన కల్పం అనే గ్రంథాన్ని రచించారని తెలిపారు. శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆరాధన, విధి విధానాలకు ఈ గ్రంథం ఎంతో ప్రామాణికమైందన్నారు. ఈ గ్రంథంలో పేర్కొన్న విధంగానే శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన సేవ జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఖానస ఆగమ పండితులు గంజాం ప్రభాకరాచార్యులు, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు అర్చకం అనంతశయనం దీక్షితులు, ఖాద్రి నరసింహాచార్యులు, పి.కే.వరదన్ భట్టాచార్యన్, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు గంజాం రామకృష్ణ, జాతీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు తనోజు విష్ణువర్ధన్, ధర్మగిరివేద విజ్ఞాన పీఠం విద్యార్థులు పాల్గొన్నారు. పుష్పయాగానికి అంకురార్పణతిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 02వ తేదీ బుధవారం జ‌రుగ‌నున్న పుష్పయాగానికి మంగళవారం సాయంత్రం 5.30 – 8.30 గం.ల మధ్య సేనాధిప‌తి ఉత్సవం, శాస్ర్తోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ విష్వక్సేనులవారు ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించారు. ఆ త‌రువాత అంకురార్పణ కార్యక్రమాలు చేప‌ట్టారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు సతీసమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో శ్రీదేవి , భూదేవి సమేత స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6 – 7.30 గం.ల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను ఆశీర్వదించనున్నారు.