వరదలో చిక్కుకున్న వ్యక్తి.. ‘డ్రోన్‌’తో కాపాడిన చైనా రైతు, వీడియో వైరల్

Wait 5 sec.

ప్రపంచ దేశాలతో పోల్చితే.. రోజురోజుకూ బాగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో టెక్నాలజీని అందిపుచ్చుకుని.. శరవేగంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వ్యవసాయంలో కూడా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని.. అత్యధిక ఉత్పత్తిని సాధిస్తోంది. ఇందుకోసం వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించి.. పురుగు మందులు, మందులను పంటకు చల్లుతున్నారు. అయితే తాజాగా అలాంటి డ్రోన్.. ఒక మనిషి ప్రాణాలను కాపాడింది. ఇటీవల చైనాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తగా.. అందులో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. అతడ్ని కాపాడేందుకు పొరుగున ఉన్న ఓ రైతు.. తన డ్రోన్‌ను ఉపయోగించాడు. ఇలా డ్రోన్ సాయంతో మనిషిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జీ ప్రావిన్స్‌లోని లియుజౌ నగరంలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. వీటి కారణంగా అక్కడి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయింది. ఈ క్రమంలోనే ఆ వరదల్లో ఒక వ్యక్తి తన కూలిపోతున్న రెండంతస్తుల ఇంటి పైకప్పుపై చిక్కుకుపోయాడు. తన ప్రాణాలు కాపాడాలని సహాయం కోసం కేకలు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరద వేగంగా ప్రవహిస్తున్న నీటి కారణంగా.. రెస్క్యూ స్పీడ్‌బోట్లు ఆ ప్రాంతానికి చేరుకోలేకపోయాయి. సరిగ్గా అదే సమయంలో.. అతని పొరుగువాడైన లై అనే వ్యక్తి తన వ్యవసాయ డ్రోన్‌ను రంగంలోకి దించాడు.సాధారణంగా ఇటుకలు, సిమెంట్‌ను రవాణా చేయడానికి లేదా పురుగు మందులు పిచికారీ చేయడానికి ఉపయోగించే ఆ డ్రోన్ 100 కిలోల బరువును మోయగలదని తెలుస్తోంది. డ్రోన్ లిఫ్టింగ్ తాడుకు ఒక చివర ఇసుక సంచిని కట్టి.. దానికి సేఫ్టీ బకిల్‌ను అమర్చి వరదల్లో చిక్కుకున్న వ్యక్తి వద్దకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో అతడికి ఫోన్‌ చేసి.. ఇసుక సంచిపై కూర్చొని, సేఫ్టీ బకిల్‌తో తన చేతులు, కాళ్లను డ్రోన్ తాడుకు కట్టుకోవాలని సూచించాడు. సుమారు 65 అడుగుల ఎత్తులో డ్రోన్ ఎగురుతూ ఉండగా.. దానికి ఆ వ్యక్తి వేలాడుతూ కనిపించాడు. చెట్లు, పైలాన్‌ల మధ్య నుంచి డ్రోన్ చాకచక్యంగా ప్రయాణించి.. చివరికి ఆ వ్యక్తిని సురక్షితంగా రోడ్డుపై దించింది.అయితే గతేడాది ఆగస్టులో డ్రోన్‌ను ఆపరేట్ చేయడం నేర్చుకున్నట్లు లై తెలిపాడు. అయితే తాను చేసిన పని చట్టవిరుద్ధం అని తెలిసినప్పటికీ.. ఆ సమయంలో ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు వెల్లడించాడు. మానవసహిత డ్రోన్లు చట్టవిరుద్ధం అని తనకు తెలుసని.. కానీ ఆ సమయంలో ఇల్లు కూలిపోతుందేమోనని భయంతోనే అతడ్ని రక్షించడానికి ఈ పని చేసినట్లు చెప్పాడు. కానీ ఇలా ఎవరూ ఇలా చేయాలని తాను సూచించనని లై పేర్కొన్నాడు.