శ్రీవారిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. కొంతమంది కాలినడకన శ్రీవారి దర్శనం కోసం వస్తే.. మరికొంతమంది ఆన్‌లైన్ వేదికగా శ్రీవారి దర్శనం, వసతి టికెట్లు బుక్ చేసుకుని తిరుమల కొండకు వస్తుంటారు. ఇలా ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకుని తిరుమలకు వచ్చే భక్తులలో ఎక్కువ మంది తిరుమల దేవస్థానం అధికారిక వెబ్‌సైట్లను సంప్రదిస్తే.. మరికొంతమంది దళారులను నమ్మి మోసపోతుంటారు. ఇంకొంతమంది నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోతుంటారు. అలాంటి వ్యవహారమే ఒకటి తాజాగా వెలుగుచూసింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, అభిషేకం, శ్రీవారి దర్శనం టికెట్లు ఇస్తామంటూ ఫేస్ బుక్ పేజీ ద్వారా మోసం చేస్తున్న వైనం వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులను అప్రమత్తం చేస్తూ టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి దర్శనం టికెట్ల విషయంలో నకిలీ వ్యక్తులను నమ్మి మోసపోవద్దంటూ టీటీడీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వైష్ణవ్ యాత్రాస్ పేరుతో పెద్దింటి ప్రభాకరాచార్యులు అనే వ్యక్తి శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కల్పిస్తామని ప్రచారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని టీటీడీ పేర్కొంది. ఇలాంటి నకిలీ వ్యక్తులను అలాగే వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని, టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి దర్శనం, వసతి, ఆర్జిత సేవలు టిక్కెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.తిరుమలలో చిరుత సంచారం..మరోవైపు తిరుమలలో చిరుత సంచారం మంగళవారం కలకలం రేపింది. అన్నమయ్య భవన్ అతిధి భవనం సమీపంలో చిరుత సంచరించినట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఇనుప కంచెను దాటుకుని చిరుత వచ్చినట్లు సీసీటీవీలో రికార్డైంది. కొంతమంది భక్తులు ఈ విషయాన్ని టీటీడీ సిబ్బందికి తెలియజేశారు. అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సైరన్లు మోగించడంతో చిరుత అటవీ ప్రాంతంలోకి తిరిగి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే తిరుమల కొండలలో అనేక వన్యప్రాణులు సంచరిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడూ ఇలా భక్తులు ఉండే ప్రదేశాలకు వస్తూ ఉంటాయి. అయితే టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తుంటారు.