తెలంగాణలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మె్ల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలో మెుత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మార్చి 10 వరకు నామినేషన్లకు తుది గడువు ఇచ్చారు. మార్చి 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతోన్న హసన్ మీర్జా, యెగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పదవీ కాలం మార్చి 29న ముగుస్తుండగా.. ఖాళీ కానున్న ఈ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణలో మెుత్తం ఎమ్మెల్యేల సంఖ్య 119 కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 64 మంది విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో 10 మంది కాంగ్రెస్ గూటికి చేరారు. మెుత్తం 5 స్థానాలకు గాను సంఖ్యా పరంగా కాంగ్రెస్ నాలుగు స్థానాలు, బీఆర్ఎస్ ఒక స్థానం దక్కించుకునే ఛాన్సుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ విప్ జారీ చేసే అవకాశం ఉంది.