ఏం చేసుకుంటారో చేసుకోండి.. విచారణకు వెళ్లే ప్రసక్తేలేదు.. కబ్జా ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే

Wait 5 sec.

భూ ఆక్రమణలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న రాజంపేట వైఎస్ఆర్సీపీ అమర్‌నాథ్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎస్టేట్‌ నిర్మించుకున్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అంతేకాదు, తాను ఎటువంటి విచారణకు రాబోనని, ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ విసిరారు. నోటీసుల్లో ఏముందో తనకు తెలియదని, ఎస్టేట్లో ఎక్కడైనా ప్రభుత్వ, ఇతరుల భూములుంటే స్వాధీనం చేసుకోవచ్చని ఆయన తేల్చిచెప్పారు. ఎవరి బెదిరింపులకూ తాను భయపడబోనని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు ఇప్పటివి కావని, కడప పర్యటనకు వచ్చినప్పుడు నారా లోకేష్ కూడా ఆరోపించారన్నారు. నేను భూముల ఆక్రమించి ఉంటే తీసుకోమని ఎప్పుడో చెప్పానని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే ఆకేపాటి, ఆయన కుటుంబసభ్యులు పేరుతో ఉన్న 39.58 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్లు ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశాలతో జాయింట్‌ కలెక్టర్‌ ఇటీవల నోటీసులు జారీచేశారు. తమ ముందు శనివారం హాజరై ఆ భూములు ఎలా వచ్చాయో చూపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో శనివారం జేసీ కోర్టకు తన లాయర్‌ను పంపి.. రాజంపేట కోర్టులో పిటిషన్‌ వేస్తున్నామని సమాచారమిచ్చారు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ, ఎసైన్డ్, అటవీ భూములను అణ్యాక్రాంతం చేసుకున్నారనే ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ భూములను మొదట ఎస్సీ, ఎస్టీల పేర్లపై రాయించి, ఎసైన్‌మెంట్‌ కమిటీలతో సంబంధం లేకుండానే డి-ఫారం పట్టాలు ఇప్పించి, తర్వాత వాటిని తన పేరుపై, కుటుంబసభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగా, రాజంపేట పరిసర ప్రాంతాల్లో ఆకేపాటి ముఖ్య అనుచరులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి.. నిర్మాణాలు చేపట్టారని ఇటీవల రెవెన్యూ అధికారులు వాటిని పడగొట్టి స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, తమ నోటీసులకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు స్పందించకపోవడాన్ని జిల్లా ఉన్నతాధికారులు సైతం తీవ్రంగా పరిగణిస్తున్నారు. కోర్టులో పిటిషన్‌కు, తమ నోటీసులకు ఎటువంటి సంబంధం లేదని జేసీ స్పష్టం చేశారు.