వారాంతం కావడంతో శ్రీవారి దర్శనాలకు భక్తులు శనివారం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ముఖ్యంగా శ్రీవారి మెట్టుకు భక్తులు పోటెత్తారు. ఈ మార్గంలో తక్కువ సమయంలోనే కాలినడకన తిరుమల చేరుకోవచ్చనే ఉద్దేశంతో పెద్దఎత్తున మెట్టు మార్గానికి వచ్చారు. అయితే, ఆటోడ్రైవర్ల కారణంగానే అక్కడ రద్దీ ఏర్పడింది. మెట్టు మార్గం వద్ద పనిచేసే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బందితో ఒప్పందం చేసుకున్న ఆటోడ్రైవర్లు.. టైమ్‌స్లాట్‌ టోకెన్లు ఇప్పిస్తామని దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను ఇక్కడికి తీసుకొచ్చారు. దీంతో ఈ టోకెన్ల విషయమై ఆటో డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. 3 వేల టోకెన్లు జారీ చేయగా గంటల్లో ఖాళీ అయ్యాయి. దీంతో మిగతా భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతకొద్ది రోజులుగా రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండు నుంచి భక్తులను తమ ఆటోలో వస్తే క్షణాల్లో స్వామివారి టైమ్‌స్లాట్‌ దర్శన టోకెన్లు ఇప్పిస్తామని ఆటో డ్రైవర్లు నమ్మించి మోసగిస్తున్నారు. వారి మాటలకు నమ్మి వారు అధిక ఛార్జీల దోపిడీకి గురవుతున్నారు. వీరి నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు.