ఈశాన్య రాష్ట్రం అసోంను బుధవారం అర్ధరాత్రి వణికించింది. అర్ధరాత్రి 2.25 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రతతో అసోంలోని మోరిగావ్‌లో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే, భూకంప నష్టం గురించి తక్షణమే ఎటువంటి సమాచారం అందలేదు. అర్ధరాత్రి సమయంలో భూకంపం రావడంతో నిద్రలో ఉన్న జనం ఉలిక్కిపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. రాత్రంతా ఆరు బయటే జాగారం చేశారు. రిక్టర్ స్కేల్‌పై 5 అంటే మధ్యస్థ భూకంపం. దీని తీవ్రతకు ఇళ్లలో వస్తువులు పడిపోవడం, శబ్దాలతో స్వల్ప నష్టాన్ని కలిగిస్తుంది.