తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ జిల్లాల గాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ, ఉమ్మడి వరంగల్‌-ఖమ్మం-నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడు స్థానాల్లో ఓటింగ్‌ కోసం 973 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్లు, టీచర్లు ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ ప్రత్యేక సెలవును ప్రకటించింది. ప్రైవేట్‌ విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాల్లో పనిచేసే వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు. మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మెుత్తం ఓట్ల సంఖ్య 3,55,159. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పోటీలో ఉండగా.. మెుత్తం ఓట్ల సంఖ్య 27,088. వరంగల్ -ఖమ్మం- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది పోటీ పడుతుండగా.. మెుత్తం ఓటర్లు 25,797. ప్రస్తుతం మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీగా రఘోత్తమ్‌రెడ్డి, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు. వీరి పదవీకాలం మార్చి 29న ముగియనుండగా.. నేటి పోలింగ్ ఓట్ల లెక్కింపును మార్చి 3న చేపడుతారు. తొలిసారి ఓటేసే వారికి సూచనలుఓటు వేసేందుకు ఓటరు గుర్తింపు కార్డు అవసరం. లేదంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్‌పోర్టు వంటివి) ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చు. పోలింగ్ స్టేషన్‌లో ఎన్నికల అధికారులు ఇచ్చే పెన్నుతో మాత్రమో ఓటేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల పేర్లకు ముందున్న బాక్సుల్లో 1, 2, 3, 4, 5 ఇలా ప్రాధాన్యత క్రమంలో నెంబర్లు వేయాల్సి ఉంటుంది.బ్యాలెట్ పేపర్‌పై కేవలం 1, 2, 3, 4, 5 అంకెలను మాత్రమే రాయాల్సి ఉంటుంది.రోమన్ అంకెలు కానీ.. ఒకటి, రెండు అని తెలుగు.. వన్, టూ, త్రీ అని ఇంగ్లీషులో రాస్తే ఓటు చెల్లదు. అభ్యర్థుల ఫోటో పక్కన టిక్ మార్కు పెట్టినా ఓటు చెల్లకుండా పోతుంది. ఒక అభ్యర్థి ఒక ప్రాధాన్యత నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు 1 అనే నెంబర్ ఇద్దరు లేదా ముగ్గురికి ఇస్తే ఆ ఓటు చెల్లదు. పోలింగ్ సిబ్బంది ముందే బ్యాలెట్ పేపర్ మడత పెట్టి ఇస్తారు. అలా కాకుండా అడ్డదిడ్డంగా ఫోల్డింగ్ చేస్తే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. సాయంత్రం 4 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారిని ఓటేసేందుకు అనుమతి ఇస్తారు.