టాటా క్యాపిటల్ ఐపీవోకు బోర్డు గ్రీన్ సిగ్నల్.. రయ్‌మని పెరిగిన టాటా ఇన్వెస్ట్‌మెంట్ షేర్ ధర..!

Wait 5 sec.

టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. టాటా క్యాపిటల్‌ ఐపీవో ప్రణాళికలకు ఆ సంస్థ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది. టాటా గ్రూప్ నుంచి దాదాపు రెండు దశాబ్దాల క్రితం టీసీఎస్ ఐపీవోకు రాగా.. చివరిగా 2023 నవంబర్లో టాటా టెక్నాలజీస్ ఐపీవోకు వచ్చింది. ఐపీవో ప్రణాళికలో భాగంగా ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ అయిన టాటా క్యాపిటల్ 23 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనుంది.టాటా క్యాపిటల్ పబ్లిక్ ఆఫర్‌కు ఆ సంస్థ బోర్డు ఆమోదం తెలపడంతో.. టాటా ఇన్వెస్ట్‌మెంట్ షేర్ ధర 8 శాతం పెరిగింది. మంగళవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో టాటా ఇన్వెస్ట్‌మెంట్ షేరు ధర రూ.6,220.75కు చేరుకుంది. బ్యాంకింగ్ యేతర ఆర్థిక సేవలు అందించే టాటా క్యాపిటల్.. గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌కు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ప్రస్తుతం టాటా క్యాపిటల్‌లో టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (TICL)కు 2% కంటే ఎక్కువ వాటా ఉండగా.. టాటా సన్స్‌కు 93% వాటా కలిగి ఉంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌ ద్వారా టాటా క్యాపిటల్‌లో టాటా సన్స్ వాటా తగ్గనుంది. అయితే ఇది ఎంత మేర తగ్గనుందనేది తర్వాత తేలనుంది.రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే టాటా క్యాపిటల్‌ను అప్పర్ లేయర్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC)గా వర్గీకరించింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా సెప్టెంబర్ 2025 నాటికి ఈ సంస్థ పబ్లిక్‌గా మారాల్సి ఉంటుంది.టాటా ఇన్వెస్ట్‌మెంట్ స్టాక్ గత ఐదేళ్లలో 588.12 శాతం పెరగడం గమనార్హం. స్వల్ప కాలానికి చూస్తే.. ఈ స్టాక్ ఒక ఏడాదిలో 12 శాతం తగ్గగా.. ఆరు నెలల్లో 2 శాతం పెరిగింది.టాటా క్యాపిటల్ ఐపీవో వివరాలు:టాటా క్యాపిటల్ ఐపీవోలో భాగంగా.. 10 రూపాయల ముఖ విలువ కలిగిన 23 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీ చేస్తారు. మిగిలిన షేర్లలో కొన్ని ప్రస్తుత, అర్హత ఉన్న షేర్‌హోల్డర్ల ద్వారా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో విక్రయిస్తారు. ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ పరిమాణం, షేర్లు అమ్మే ఇన్వెస్టర్లు ఎవరనేది ఇంకా వెల్లడించలేదు.టాటా క్యాపిటల్‌ను 2007లో ఏర్పాటు చేశారు. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఆస్తి తనఖా రుణాలు లాంటి వివిధ రకాల రుణాలను ఈ సంస్థ అందిస్తుంది. వెల్త్ మేనేజ్‌మెంట్, పెట్టుబడి సేవలను కూడా టాటా క్యాపిటల్ అందిస్తుంది. టాటా క్యాపిటల్ బోర్డు.. ఐపీవో ప్రణాళికలను ఆమోదించడంతోపాటు.. రూ.1504 కోట్ల రైట్స్ ఇష్యూకు సైతం ఆమోదం తెలిపింది. ఐపీవోకు రావడానికి ముందు సంస్థ యొక్క క్యాపిటల్ బేస్ బలోపేతం కావడానికి ఇది దోహదం చేస్తుంది.