నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదిన లోక్‌సభ సీట్లు తగ్గుతాయా.. అమిత్ షా క్లారిటీ

Wait 5 sec.

: కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చిపడింది. ఇప్పటికే తాము అధిక పన్నులు కడుతున్నా.. కేంద్రం నుంచి నిధులు మాత్రం తక్కువగా వస్తున్నాయని.. దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే నియోజకవర్గాల పునర్విభజన మరో తలనొప్పిగా మారింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం వల్ల.. గతంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా జనాభా నియంత్రణ కఠినంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల నేతలు ఒక్కొక్కరుగా కేంద్ర ప్రభుత్వంపై గళం ఎత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళనాడులో పర్యటించిన కేంద్ర హోం శాఖ మంత్రి .. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల.. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క లోక్‌సభ సీటు కూడా తగ్గదని స్పష్టం చేశారు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన శివరాత్రి వేడుకలో పాల్గొనేందుకు తమిళనాడు కోయంబత్తూరుకు చేరుకున్న అమిత్ షా.. బీజేపీ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గవని స్పష్టం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. ఆయన కుమారుడు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.. ప్రజలకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు దక్షిణ భారత రాష్ట్రాలకు.. దామాషా నిష్పత్తిలో ఒక్క పార్లమెంటు స్థానం కూడా తగ్గదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు తాము అన్యాయం జరగనివ్వమని వెల్లడించారు. మరోవైపు నిధుల కేటాయింపులో తమిళనాడుకు అన్యాయం జరిగిందని సీఎం స్టాలిన్‌ చేస్తున్న ఆరోపిణలను ఖండించిన అమిత్ షా.. 2014-24 మధ్య తమిళనాడుకు మోదీ ప్రభుత్వం రూ.5,08,337 కోట్లను ఇచ్చిందని వివరించారు. అంతేకాకుండా తమిళనాడుకు అన్యాయం చేసింది గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమేనని అమిత్ షా మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా కంటే తమిళనాడులోనే బీజేపీ ఘన విజయాన్ని సాధించి.. అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అమిత్ షా వెల్లడించారు. ఇక త్రిభాషా విధానంపై తమిళనాడులో రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ.. తమిళం అత్యంత ప్రాచీన భాష అని తెలిపిన అమిత్ షా.. తాను తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు క్షమించాలని కోరారు.