పోసాని కాదు.. నన్ను కూడా అరెస్ట్ చేస్తామని TDP నేతలు బెదిరించారు: ప్రొఫెసర్ నాగేశ్వర్

Wait 5 sec.

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయంలో చంద్రబాబు, పవన్ సహా ఇతర నేతలు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని ఏపీకి తరలించారు. కాగా, ఈ అరెస్టు వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోసానిని అరెస్టు చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. పోసాని అరెస్టును మాజీ సీఎం జగన్ సైతం ఖండించారు. అతడికి అండగా ఉంటామని అన్నారు. ఈ క్రమంలో పోసాని అరెస్టుపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కీలక కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో అసభ్యంగా మాట్లాడుకోవటం కొత్తేమీ కాదని అన్నారు. పోసాని కృష్ణ మురళీ మెదటి వాడో చివరి వాడో కాదని చెప్పారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తనను కూడా అరెస్టు చేస్తామని టీడీపీ నేతలు బెదిరించినట్లు చెప్పారు. 'రాజకీయాల్లో చాలా ఘోరంగా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకున్నవారందరిపై కేసులు పెట్టారా..? అంటే పెట్టకపోవచ్చు. అధికారంలో ఉన్నారు కాబట్టి కొందర్ని టార్గెట్ చేసి అటాక్ చేయవచ్చు. రాజకీయాల్లో కక్షలు, సాధింపులు కామన్. అధికారంలో ఉండగా.. కేసులు మాఫీ అవుతాయి. అధికారం పోతే కేసులు తారుమారవుతాయి. తెలుగుదేశం కార్యకర్తల నుంచి నాయకులపై రోజు రోజుకూ ఒత్తడి పెరుగుతుంది. ఇంకా వారిని, వీరిని అరెస్టు చేయలేదనే అసహనం ఉంది. వ్యతిరేక వర్గాన్ని లోపల వేయకపోవటం వల్ల టీడీపీలో అసహనం పెరుగుతోంది. పోసాని, వల్లభనేనే కాదు తమని ప్రశ్నించే ఎవరిపైనైనా టీడీపీ నేతలు అసహనంతోనే ఉన్నారు. వాళ్లను ఎవరూ ప్రశ్నించకూడదు. మేం మోదీని తిడితే తిట్టాలి.. పొడిగితే పొగడాలి అనే ధోరణితో టీడీపీ వాళ్లున్నారు. నా లాంటి వాళ్లకు కూడా బెదిరింపులు తప్పట్లేదు. నాకు ఫోన్లు, మెసేజ్‌లు చేసి నిన్ను కూడా అరెస్ట్ చేస్తాం.. లోపల వేస్తాం.. పోలీస్ స్టేషన్లకు తిప్పుతాం అనే బెదిరింపులు వస్తుంటాయి. వారి అసహనం ఆ స్థాయిలో ఉంటుంది. నేనెప్పుడూ అసభ్యంగా మాట్లాడలేదు. చంద్రబాబు ఏం మాట్లాడితే అలాగే మాట్లాడాలనేది వారి ధోరణి.' అని ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక కామెంట్స్ చేశారు.