ఆ పని చేస్తున్నందుకే వాళ్లు నన్ను చంపాలని చూస్తున్నారు..: ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్లు

Wait 5 sec.

Musk Claims Democrats Want to kill Me: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత పాలనలో శత్రువుగా ఉన్న ఎలాన్ మస్క్‌ను ఈసారి మాత్రం తీసుకొచ్చి పక్కనే పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విభాగాల్లో ప్రక్షాళన కోసం పలు కీలక విధానాలు తీసుకువచ్చే డోజ్ అధినేతగా మార్చారు. ఈక్రమంలోనే ట్రంప్, మస్క్‌లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందిస్తూనే తాజాగా మస్క్ షాకింగ్ కామెంట్లు చేశారు. తాను చేస్తున్న పని వల్ల డెమోక్రాట్లు తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. డోజ్ సంస్కరణలు ఏమాత్రం నచ్చకపోవడమే అందుకు కారణం అని వివరించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. అమెరికాలో పన్ను చెల్లింపుదారుల ధనం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బయటపెడుతున్నారంటూ ఓ నెటిజెన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. డెమోక్రాట్లకు ఈ విషయం బాగా అర్థం అవుతుందని.. మీ డబ్బులు తీసుకోవడం కోసం మస్క్ రాలేదంటూ వివరించాడు. అంతేకాకుండా మీ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారి పేర్ల జాబితాను బయటకు తీసుకు వస్తున్నారంటూ వెల్లడించాడు. దీనికి మస్క్‌ను కూడా షేర్ చేయగా.. ఆయన స్పందించారు. దీనికి బదులు ఇస్తూనే.. అలా చేస్తున్నందుకే డెమోక్రాట్లు నన్ను చంపాలని చూస్తున్నారని వివరించారు. దీన్ని బట్ట చూస్తేనే ఇది ఎంత పెద్ద విషయమో మీరే అర్థం చేసుకోవచ్చని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారంతా నిజంగానే మస్క్‌ను డెమోక్రాట్లు చంపాలని చూస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ మస్క్‌కు వివరిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఇటీవలే మస్క్ దాదాపు 2.3 మిలియన్ల మంది ఫెడరల్ ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగులు తమ పనిపై వివరణ ఇవ్వకపోతే రాజీనామా చేయాలంటూ గడువును కూడా విధించారు. అయితే దీనిపై ఫెడరల్ ఏజెన్సీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా మస్క్ తన పని తాను చేసుకుని పోతున్నారు. ఇప్పటికే ట్రంప్, మస్క్ పద్ధతులను వ్యతిరేకిస్తూ.. 21 మంది డోజ్ ఉద్యోగులు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.