'మజాకా' మూవీ రివ్యూ - కొంత కామెడీగా, మరికొంత బోరింగ్‌గా

Wait 5 sec.

ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత త్రినాథరావు నక్కిన చేస్తున్న చిత్రం కావడం.. సందీప్ కిషన్ మంచి ఫాంలో ఉన్నప్పుడు చేసిన సినిమా కావడంతో మజాకా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ చూస్తుంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌ అని అర్థం అయింది. కొత్తగా ఏమీ ఉండదని అందరికీ తెలిసే ఈ సినిమాకు వస్తారు. మరి అలాంటి ఆడియెన్స్‌ని ఈ చిత్రం కంప్లీట్‌గా సంతృప్తి పరిచిందా? లేదా? అన్నది చూద్దాం.కథరమణ (రావు రమేష్) ఒంటరిగానే తన కొడుకు కృష్ణ (సందీప్ కిషన్)ను పెంచుతాడు. కొడుకు పుట్టగానే భార్య చనిపోయినా కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా రమణ ఉండిపోతాడు. ఇక ఇంట్లో ఆడ దిక్కులేకపోవడంతో రమణ, కృష్ణలు ఇష్టారీతిగా ఉంటారు. కొడుక్కి పెళ్లి చేసేందుకు రమణ చాలా కష్టపడుతుంటాడు. ఆడ దిక్కు లేని సంసారం కదా? అని పిల్లనిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో తానే పెళ్లి చేసుకోవాలని రమణ ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే యశోద (అన్షు)ని చూసి రమణ ఇష్టపడతాడు. మరో వైపు మీరా (రీతూ వర్మ)తో కృష్ణ ప్రేమలో పడతాడు. అటు తండ్రి, ఇటు కొడుకు ప్రేమ పాఠాలు అంటూ బిజీగా ఉంటారు. ఇక భార్గవ్ వర్మ (మురళీ కృష్ణ) తనకు ఎదురు తిరిగిన వాళ్లని, నచ్చని వాళ్లని పగబట్టి పీడిస్తుంటాడు. అలాంటి భార్గవ్ వర్మ కూతురు మీరా, చెలి యశోదను ఈ తండ్రీకొడుకులు ప్రేమిస్తారు. ఇంట్లోకి ఓ ఫ్యామిలీ ఫోటోను తీసుకు రావాలని ఈ తండ్రీ కొడుకులు చేసే ప్రయత్నాలు ఏంటి? మీరా, యశోద మధ్య ఉన్న కోల్డ్ వార్ ఏంటి? చివరకు తండ్రీ కొడుకుల ప్రేమ కథ సఫలం అవుతుందా? అన్నది మిగతా కథ.మజాకా మూవీ కథను ఎంతో ఎమోషనల్‌గా నడిపించొచ్చు.. వినోదాత్మకంగానూ చెప్పొచ్చు. ఇదొక బాధాకరమైన కథగా కంటే.. నవ్వులు పూయించే కథగా చెప్పేందుకే దర్శకుడు ఎక్కువగా ప్రయత్నాలు చేశాడు. అలా కామెడీ ఎంటర్టైనర్‌గా తీస్తేనే జనాలు ఆదరిస్తారని అనుకుని ఉండొచ్చు. కావాల్సినంత వినోదం పండించేందుకు స్కోప్ కథే ఇది. కానీ ఈ కామెడీ వర్కౌట్ అవుతుందా? లేదా? కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుందా? అన్నది చూసుకోవాల్సింది. త్రినాథరావు నక్కిన రాసుకున్న కథ, కథనం చాలా చోట్ల ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రమే నవ్వించే ఈ చిత్రం.. చాలా చోట్ల బోరింగ్‌గా, ఊహకు అందేలా సాగుతుంటుంది.ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదనిపిస్తాడు డైరెక్టర్. ఎక్కడా కొత్త సీన్ పడకపోయినా.. నెక్ట్స్ ఏం జరుగుతుందో చెప్పేలా కథనం సాగుతున్నా కూడా ఏమంతా పెద్ద సమస్యగా అనిపించదు. ఇలాంటి కామెడీని, అలాంటి సీన్లను గత కొన్నేళ్లుగా ఆడియెన్స్ చూస్తూనే వస్తున్నారు. ఎక్కడా కూడా అరె ఇది చాలా కొత్తగా ఉందే.. ఈ సీన్ భలే ఉందే అని అనిపించేలా మాత్రం ఉండదు. జబర్దస్త్ కామెడీ స్కిట్ల మాదిరి కొన్ని చోట్ల పంచ్‌లు మాత్రం నవ్విస్తాయి.ఇక సెకండాఫ్ ఎలాంటి సమస్యలు వస్తాయి? కథను ఎలా తిప్పుతారు? అని అంతా ఎదురుచూసేలానే ఉంటుంది. కానీ కీలకమైన సెకండాఫ్ దారి తప్పినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడా కూడా ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్ పడదు. చాలా చోట్ల తల పట్టుకునేలా సీన్లు సాగుతుంటాయి. ఇక సెకండాఫ్ బోరింగ్‌గా అనిపిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదేమో. కథలో పస లేక.. ఏం చేయాలో తెలీక.. అక్కడక్కడే కథను తిప్పేశాడనిపిస్తుంది. ఈ కథలో కావాల్సినంత సెంటిమెంట్‌ను, ఎమోషన్‌ను జొప్పించే అవకాశం ఉంది. కానీ దర్శకుడు ఆ దారిని ఎంచుకోలేదు.చివర్లో ఓ రెండు సీన్లలో మాత్రం ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. కానీ అది కూడా జనాలకు అంతగా ఎక్కదు. అసలు సినిమాలోని ఏ పాత్రతోనూ ఆడియెన్స్ అంతగా కనెక్ట్ కాలేరేమో అనిపిస్తుంది. తండ్రీ కొడుకుల మధ్య కూడా ఆహా అనిపించే ఓ ఎమోషనల్ సీన్ గానీ, ఎమోషనల్ కనెక్టివిటీ గానీ కనిపించదు. మజాకా చిత్రం జబర్దస్త్ కామెడీ స్కిట్లకు ఎక్కువ.. కామెడీకి తక్కువ అన్నట్టుగా ఉంటుంది. నిజంగానే ఆడియెన్స్ ఈ మూవీని చూస్తే.. మా డబ్బులంటే మీకు అంత మజాకా అని అనేలానే ఉన్నారు.సందీప్ కిషన్ చాలా చోట్ల అవలీలగా నటించాడు. అసలు ఇందులో అంత కష్టపడి నటించాల్సిన సీన్ ఒక్కటి కూడా లేదనిపించింది. సందీప్ కిషన్‌‌కు ఇలాంటి లవర్ బాయ్, పక్కింటి కుర్రాడి పాత్రలు కొట్టిన పిండి. రావు రమేష్‌‌కి మాత్రం ఇది చాలా కొత్త పాత్ర. ఇలాంటి పాత్రలో రావు రమేష్ కనిపించడం మొదటి సారి. చాలా చోట్ల రావు రమేష్ తన టైమింగ్‌తో నవ్విస్తాడు. రీతూ వర్మ నటనకు స్కోప్ దక్కే పాత్ర అయితే కాదనిపిస్తుంది. అన్షుకి కూడా ఈ సినిమా అంతగా ఉపయోగపడకపోవచ్చు. మురళీ శర్మ కారెక్టరైజేషన్, నటన బాగుంటుంది. హైపర్ ఆది, శ్రీనివాస్ రెడ్డి, రఘు బాబు వంటి పాత్రలు కొన్ని సందర్భాల్లో నవ్విస్తాయి.సాంకేతికంగా ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. కానీ పాటలు ఎందుకు వస్తున్నాయో అర్థం కానట్టుగా ఉంటాయి. ఇష్టానికి అలా పాటలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి. ఏ పాట ప్లేస్ మెంట్ కూడా సరిగ్గా ఉండదనిపిస్తుంది. పాటలు కంటే మాటలే ఎక్కువగా పేలుతాయి. పంచ్ డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్విస్తాయి. కెమెరామెన్ విజువల్స్, ఎడిటింగ్ ఇలా అన్నీ కూడా పర్వాలేదనిపిస్తాయి. ఏ మాత్రం అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లోకి వచ్చి.. లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి.. మజాకాను చూస్తే.. కొన్ని చోట్ల నవ్వుతారు.. ఇంకొన్ని చోట్ల తలపట్టుకుంటారు.. మరి కొన్ని చోట్ల బోరింగ్‌గా ఫీల్ అవుతారు.