తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని వార్త వినిపించింది. వేసవి కాలం ఇంకా ఎంటరవకముందే.. ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లాలంటే.. చెమటలు పడుతున్నాయి. ఉక్కపోతతో జనం అప్పుడే అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, మహాబూబ్నగర్‌, మెదక్‌ జిల్లాల్లో మాత్రం సాధారణానికి మించి 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గాలి అనిశ్చితి వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయని పేర్కొన్న వాతావరణ శాఖ అధికారులు.. రాగల 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ మేర తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఒకరోజు ఉత్తర తెలంగాణలో, మరోరోజు దక్షిణ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.ఎండా కాలంలో వడగాలులు ఎలా ఉంటాయనే వివరాలకు సంబంధించిన అంచనాల రిపోర్టును ఫిబ్రవరి నెల చివర్లో ఐఎండీ విడుదల చేస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గాలిలోకి తేమ ప్రవేశించడం వల్ల ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లుగా అనుభూతి ఉంటుందని.. ఫలితంగా శరీరానికి మంట కలిగినట్లుగా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఉత్తర, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వచ్చినప్పుడు గాలిలోకి తేమ ప్రవేశించి ఉష్ణోగ్రత అధికంగా ఉన్నట్లుగా ప్రజలు భావిస్తారని తెలిపారు. అయితే.. ప్రస్తుతం మాత్రం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకొచ్చారు. గాలిలోని అనిశ్చితి కారణంగానే వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. గత రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. గత వారంతో పోల్చితే ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత 33 నుంచి 37 డిగ్రీల వరకు నమోదవుతుండగా.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 నుంచి 22 డిగ్రీల వరకు ఉన్నాయని తెలిపారు. అయితే.. వచ్చే 2, 3 రోజుల్లో ఒక డిగ్రీ ఉష్ణోగ్రత తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. గాలిలో అనిశ్చితి కారణంగా.. ఉత్తర తెలంగాణలో ఒకలా, దక్షిణ తెలంగాణలో మరోకలా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.మొత్తానికి వచ్చే రెండు మూడు రోజులు మాత్రం ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల కంటే కాస్త తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అధికారులు చెప్పటంతో.. తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట లభించినట్టయింది.