హైదరాబాద్‌ వాసులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎన్నెన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాసులు కట్టినా.. పెరుగుతున్న జనాభాతో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా తీరకుండా అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. నగరంలో ఎంత జనాభా పెరిగినా, వాహనాల సంఖ్య ఎక్కువైనా ట్రాఫిక్ కష్టాలు ఎదురవకుండా ఉండేందుకు.. జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్టుకు నడుం బిగించింది. సుమారు.. రూ.1090 కోట్ల అంచనా వ్యయంతో.. నగరంలో ఆయా ట్రాఫిక్ ప్రాంతాల్లో ఏడు స్టీల్ బ్రిడ్జిలు, మరో ఏడు అండర్ పాసులు నిర్మించాలని తలపెట్టింది. కాగా.. ఈ ప్రాజెక్టుకు రెండు ప్యాకేజీలుగా విభజించింది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.ముఖ్యంగా.. కేబీఆర్ పార్క్ చుట్టూ రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో.. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో.. ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై గత కొన్ని నెలలుగా సర్కా్ర్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి.. హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌ల నిర్మించాలని నిర్ణయించారు. అయితే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టిన అధికారులు.. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 24 వరకు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. టెండర్ దాఖలు చేసిన వారి కోసం మార్చి 10వ తేదీన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రి-బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. మార్చి 26వ తేదీన బిడ్ ప్రైజ్ ఓపెనింగ్ చేయనున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే మాత్రం.. కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల నుంచి నగరవాసులకు ఉపశమనం దొరికే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.అయితే.. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ రద్దీగా ఉండే చాలా ప్రాంతాల్లో భారీ ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, స్టీల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నా సరే.. రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభా, అదే స్థాయిలో రోడ్డుపైకి వస్తున్న వాహనాల సంఖ్య పెరిగిపోతుండటంతో.. ట్రాఫిక్ సమస్య మాత్రం అలాగే ఉంటుంది. అయితే.. ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఎక్కువగా కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న రోడ్ల గుండా వెళ్తున్నారు. అయితే.. ఈ మార్గంలో ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి ఫైఓవర్లు లేకపోవటంతో.. ప్రజలు ఈ ప్రాంతంలో ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ విషయం గమనించిన ప్రభుత్వం.. భారీ ప్రాజెక్టును చేపట్టింది.