కమ్ బ్యాక్ అదిరిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ట్రై సిరీస్‌లో గాయపడిన రవీంద్ర పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌కి దూరమయ్యాడు. తలకు గాయం కావడంతో రెస్ట్ తీసుకున్న రచిన్ కమ్ బ్యాక్ మాత్రం గుర్తుండిపోయేలా ఇచ్చాడు. కెరీర్‌లో తొలి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఆడిన ఈ యువ ఆటగాడు మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర తన మార్క్ బ్యాటింగ్‌ను రుచి చూపించాడు. బంగ్లాదేశ్ జట్టు అందించిన 237 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 15 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర వికెట్ కాపడటమే కాకుండా తన బ్యాట్‌తో పరుగులు రాబట్టి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. 105 బంతులు ఆడిన రచిన్ 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 112 పరుగులు చేసి అవుటయ్యాడు. కెరీర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ ఆడిన రచిన్ మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రచిన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో ఆడిన మొదటి మ్యాచ్‌లలోనే రచిన్ రవీంద్ర శతకం చేయడం విశేషం. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023లో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన రచిన్.. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బంగ్లాదేశ్‌తో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే శతకం బాదాడు. రచిన్ రవీంద్ర తన కెరీర్‌లో నాలుగు సెంచరీలు నమోదు చేయగా.. ఆ నాలుగు కూడా ఐసీసీ వేదికలపైనే కావడం విశేషం. మూడు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023, ఒకటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025. వన్డే వరల్డ్ కప్ డెబ్యూలో 10 ఇన్నింగ్స్‌లలో 578 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తరఫున ఐసీసీ ఈవెంట్లపై నాలుగు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ఈ 25 ఏళ్ల ఆటగాడు నిలిచాడు. కేన్ విలియమ్సన్, నాథన్ మూడు మూడు సెంచరీలు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌పై రచిన్ రవీంద్ర సెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్ జట్టు 46.1 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఈ మ్యాచ్ విజయంతో న్యూజిలాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఏ నుంచి సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. పాకిస్తాన్‌పై గెలిచిన భారత్ ఇప్పటికే సెమీస్‌లో అడుగుపెట్టగా ఇప్పుడు కివీస్ వచ్చి చేరింది. గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఇంటిదారి పట్టాయి. గ్రూప్ స్టేజ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు మార్చి 2న దుబాయ్‌లో తలపడనున్నాయి.