అన్నమయ్య జిల్లాలో విషాదం..ఐదుగురు భక్తుల్ని తొక్కి చంపిన ఏనుగులు, ఆలయానికి వెళుతుండగా!

Wait 5 sec.

అన్నమయ్య జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన దగ్గర భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు చనిపోగా.. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వారిద్దరి ఆరోగ్యం పరిస్థితి కూడా విషమంగా ఉందని చెబుతున్నారు. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం వై కోట సమీపం గుండాల కోనలో ఉన్న ఈశ్వరుడి ఆలయం ఉంది. బుధవారం శివరాత్రి కావడంతో శివయ్య భక్తులు దర్శనానికి బయలుదేరి వెళుతుండగా ఏనుగుల గుంపు దాడి చేసింది.. ఈ ఘటనలో ఐదుగురు చనిపోవడంతో తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి. ఈ ఘటనలో చనిపోయిన వారిని ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.పులివెందులలో చిరుతల భయంమరోవైపు గత రెండు నెలలుగా పులివెందుల నియోజకవర్గ వాసులు భయం, భయంగా గడుపుతున్నారు. ఈ నెల 1న లింగాల మండలం రామాపురం వద్ద రైతు పొలం దగ్గర అమర్చిన విద్యుత్తు తీగలు తగిలి మగ చిరుత చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆడ చిరుత, పిల్లలు పొలాల దగ్గర వెళ్లిన తమపై దాడి చేస్తున్నాయని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది డిసెంబరు 6న తాతిరెడ్డిపల్లె గ్రామసమీప పొలాల్లో చిరుత కనిపించిందని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చిరుతను బంధించాలని జిల్లా అటవీశాఖ అధికారి వినీత్‌కుమార్‌ను రైతులు కోరారు. ఈ మేరకు ఆయన పర్యవేక్షణలో లింగాల మండలంలోని గ్రామాల్లోని తోటల్లో చిరుతల జాడ గుర్తించేందుకు ఈ నెల 19న అధికారులు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. తాజాగా వీటిని పరిశీలిస్తే కుందేళ్లు, కుక్కలు, అడవి పందుల ఫోటోలు మాత్రమే కనిపించాయి. మగ చిరుత మృతితో ఆడ చిరుత ఈ ప్రాంతంలో ఉందా..మరోచోటుకి వెళ్లిపోయిందా..అసలు ఆడ చిరుత ఉందా..అన్నది అటవీశాఖ అధికారులకు అంతుపట్టడం లేదు. చిరుతల సంచారంపై రైతులు సమాచారమిస్తే పొలాల్లో ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే ఇటీవల తోటల్ల చిరుతల కోసం అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాలకు చిక్కడం లేదు. మొత్తం మీద చిరుతల టెన్షన్ పులివెందుల వాసుల్ని భయపెడుతోంది.. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందంటున్నారు.