యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం.. ఆవిష్కరించిన సీఎం రేవంత్, గోపురం విశేషాలివే..

Wait 5 sec.

తెలంగాణలో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందిన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆవిష్కరించారు. వానమామలై మఠం 31వ పిఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణల మధ్య ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి స్వర్ణ విమాన గోపుర ప్రతిష్టాపన మహోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. గోపురం మహాసంప్రోక్షణకు 40 జీవనదుల జలాలతో అభిషేకించి సంప్రోక్షణ చేశారు. అనంతరం స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం వేద మంత్రాలతో శాస్ర్తోక్తంగా నిర్వహించింది. అనంతరం గర్భగుడిలో సీఎం రేవంత్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వాదం ఇచ్చారు. అద్భుత కృష్ణ శిల్పకళా వైభవంతో నిర్మితమైన ఆలయం నేటి నుంచి స్వర్ణమయ శోభితమైన భక్తులను కనువిందు చేయనుంది. గోపురం విశేషాలివే.. యాదగురిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఎత్తు మెుత్తం 50.5 అడుగులు కాగా.. గోపురం వైశాల్యం 10,759 చదరపు అడుగులు. తిరుమల గోపురం 33 అడుగులు కాగా.. దేశంలోనే యాదగిరి గుట్ట స్వర్ణగోపురం అతి పెద్దది.గోపురానికి స్వర్ణతాపడానికి మొత్తంగా 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. గతేడాది డిసెంబరు 1న పనులు ప్రారంభం కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 18 తాపడం కవచాల బిగింపు పనుల పూర్తయ్యాయి. బిగింపు పనులకు అయిన మొత్తం ఖర్చు.. రూ.5.10 కోట్లు కాగా.. మెుత్తంగా రూ.80 కోట్ల వరకు ఖర్చు చేశారు.తమిళనాడు మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్‌ ఆధ్వర్యంలో నానో టెక్నాలజీతో తాపడం పనులు చేపట్టారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేళిమి బంగారంతో తాపడం పనులు చేపట్టారు. 50 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా ఈ పనులు పూర్తి చేశారు.మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేసి.. వాటిని చెన్నైలోని స్మార్ట్‌ క్రియేషన్స్‌ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలగా మార్చి గోపురానికి తాపడం చేశారు.గంగా, యమున, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, నర్మదతో కలిపి మెుత్తం 40 జీవ నదుల జలాలతో స్వర్ణ విమానానికి మహాసంప్రోక్షణ చేశారు.స్వర్ణ విమాన గోపురంపై ఉన్న నృసింహ అవతారాలు, విష్ణుమూర్తి, లక్ష్మీ(ఆండాళ్ అమ్మవారు), గరుడమూర్తులు భక్తులకు స్వర్ణమయంగా కనువిందు చేయనున్నాయి.స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1నుంచి ప్రారంభమై కానుండగా.. మార్చి 23వరకు కొనసాగుతాయి. 8న స్వామి అమ్మవార్ల కల్యాణోత్సం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారికి అలంకార, వాహన సేవలు ఘనంగా నిర్వహిస్తారు.