భారత్-పాక్ మ్యాచ్ అంటేనే హడావుడి. అందరిలోనూ ఆఖరి నిమిషం వరకూ ఏం జరుగుతుందనే ఉత్కంఠ. మ్యాచ్‌కి ముందు కూడా ఇప్పుడు అలాంటి టెన్షనే నెలకొంది. ముఖ్యంగా ప్లేయింగ్ 11పై పాకిస్తాన్ జట్టు మల్లగుల్లాలు పడుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ మ్యాచ్ గెలవాల్సిందేనంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ రజా నఖ్వీ పట్టుదలతో ఉండటంతో సెలక్టర్లు జట్టులో కీలక మార్పులు చేశారంట. పాకిస్తాన్ సెలక్షన్ కమిటీపై కూడా నఖ్వీ పూర్తి స్థాయిలో నమ్మకం లేక తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు జావేద్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. దుబాయ్ వేదికగా జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ఫుల్ ప్రాక్టీస్ చేశారు. ఒక ప్రాక్టీస్ సెషన్‌లో పాకిస్తాన్ కీలక ప్లేయర్ కనిపించకపోవడం అందరిలో అనుమానాలు రేకెత్తించాయి. డు ఆర్ డై మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పీసీబీ ఛైర్మన్ ప్రజర్‌తో బాబర్‌ను పక్కన పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. "జ్వరంతో పాటు కంటి నుంచి నీరు కారుతూ బాబర్ ఆజామ్ ఇబ్బంది పడుతున్నాడని.. అందుకే ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హాజరుకాలేకపోయాడు" అంటూ పాకిస్తాన్ వైపు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వరకూ కూడా బాబర్ ఆజామ్ ఈ కీలక మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అన్న క్లారిటీ ఎవరికీ లేదు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలవడంతో ఆ దేశ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాబర్ ఆజామ్ ఆటతీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. భారీ టార్గెట్ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ అలా ఆడటం ఏంటంటూ స్టేడియం బయటనే ట్రోలింగ్‌కు దిగారు. ఆ మ్యాచ్‌లో 94 బంతులు ఆడిన బాబర్ ఆజామ్ 64 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై ఓటమి అనంతరం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, తాత్కాలిక హెడ్ కోచ్ ఆకీబ్ జావెద్, ప్లేయర్లతో ప్రత్యేకంగా మాట్లాడాట. ఎట్టి పరిస్థితుల్లోనూ టీమిండియాపై విజయం సాధించాల్సిందేనని, ఓటమిని ఒప్పుకోనంటూ చెప్పేశాడు. ఈ విజయంతో అందరి నోళ్లు మూయించాలని నఖ్వీ చెప్పాడని క్రికెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే పాకిస్తాన్ జట్టులో కీలక మార్పులకు కూడా శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కోచ్ జావెద్ కూడా టీమిండియాతో మ్యాచ్‌లో అందరికీ సర్‌ప్రైజ్ ఉంటుందని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడితే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇక ఇంటిదారి పట్టినట్లే. పాకిస్తాన్ స్క్వాడ్మహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజామ్, ఇమామ్ ఉల్ హక్, సౌద్ షకీల్, సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహీర్, ఖుష్దుల్ షా, షాహీన్ అఫ్రిది. నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, హారీశ్ రావూఫ్, కమ్రాన్ గులామ్, ఫహీమ్ అష్రఫ్, మహమ్మద్ హాస్నయిన్, ఉస్మాన్ ఖాన్.