New Virus in Congo: చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో లక్షల మంది ప్రాణాలు తీసిన కరోనా వ్యాధి నుంచి బయటపడ్డ కొన్నేళ్లకే కాంగో దేశంలో మరో కొత్త మహమ్మారి వెలుగులోకి వ్చచింది. అయితే ఈ కొత్త వైరస్ కూడా కరోనా లాంటిదేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా గబ్బిలాలు తిన్న పిల్లలకు ఈ వైరస్ సోకగా.. తీవ్ర రక్తస్రావం, జ్వరం లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఈ వైరస్ సోకిన 48 గంటల్లోనే బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో దేశ ప్రజలంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలీ కొత్త వైరస్ ఏంటి.. దీని వల్ల ఎంత మంది చనిపోయారు, మరెన్ని కేసులు నమోదు అయ్యాయి వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాంగోలో కొత్త వైరస్ కారణంగా 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటికే 419 కేసులు కూడా నమోదు అయ్యాయని వివరించింది. అయితే వైరస్ సోకిన 48 గంట్లలోనే బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని.. వారంతా తీవ్ర జ్వరం, రక్తస్రావం వంటి లక్షణాలతో బాధ పడుతున్నారని చెప్పుకొచ్చింది. అయితే కాంగో దేశం ఈ వైరస్‌ను జనవరి 21వ తేదీన కనిపెట్టగా.. నెల రోజుల వ్యవధిలోనే 53 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కల్గించే విషయమని స్పష్టం చేసింది. ఈ కొత్త వైరస్ రావడానికి కారణం పలువురు పిల్లలు గబ్బిలాల్ని తినడమే అనిశాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాంగోలోని బోలోకోకు చెందిన ముగ్గురు పిల్లలు గబ్బిలాన్ని వేటాడి తినగా.. క్షణాల్లోనే విపరీతమైన జ్వరం వచ్చినట్లు గుర్తించారు. ఆపై ఆసుపత్రికి తీసుకెళ్లగా రక్తస్రావం కూడా జరిగింది. అయితే వ్యాధి సోకిన 48 గంటల్లోనే ఈ ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అడవి జంతువులను ఎక్కువగా తినే ప్రదేశాల్లో జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమిస్తాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికాలో ఇలాంటి వైరస్‌ల వ్యాప్తి సంఖ్య గత దశాబ్దంలో 60 శాతం కంటే ఎక్కువగా పెరిగినట్లు 2022లో ప్రంపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మరోవైపు ఫిబ్రవరి 9వ తేదీన బోమాటే పట్టణంలో ఈ కొత్త వైరస్ రెండో వ్యాప్తి ప్రారంభం కాగా.. 13 కేసుల నుంచి నమూనాలను సేకరించి కాంగో రాజధాని కిన్షాసాలోని నేషనల్ ఇన్‌ స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్‌కు పంపినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే వీటిని పరిశీలించగా.. అన్ని నమూనాల్లో ఎబోలా లేదా మార్బర్గ్ వంటి సాధారణ హేమరేజిక్ జ్వరం సోకినట్లు గుర్తించారు. కొందరికి మలేరియా కూడా వచ్చినట్లు తెలుసుకున్నారు. అసలు ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, దీని ప్రభావం ప్రపంచంపై పడే అవకాశం ఉందా లేదా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆలోచిస్తోంది. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.