మన మిత్ర ద్వారా వేయి పౌర సేవలు..! ఇక వాట్సాప్ ఉంటే చాలేమో..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా భారీ ఊరట ఇచ్చే వార్త వినిపించారు. సర్టిఫికేట్లు, పన్నులు చెల్లింపు ఇలాంటి అవసరాల కోసం ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా.. చంద్రబాబు కీలక చర్యలు చేపడుతున్నారు. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తున్న చంద్రబాబు.. అందులో భాగంగా ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలకు పౌర సేవలను మరింత సులభంగా అందించాలనే ఉద్దేశంతో మెటా భాగస్వామ్యంతో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించారు. మన మిత్ర పేరుతో వాట్సాప్ ద్వారా 161 సేవలు అందిస్తున్నారు. అయితే త్వరలోనే వాట్సాప్ ద్వారా పౌర సేవలను మరింత విస్తరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వాట్సాప్ ద్వారా త్వరలోనే వేయి సర్వీసులు అందించనున్నట్లు చంద్రబాబు మంగళవారం ప్రకటించారు. ప్రజలకు మరింత సులభంగా పౌర సేవలు అందించాలనేదే తమ ప్రభుత్వం ఉద్దేశమన్నారు చంద్రబాబు. అలాగే ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందంటూ చంద్రబాబు హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసేవారని ఉపేక్షించేది లేదని.. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు సోమవారం సచివాలయంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీపై చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాట్సాప్‌ ద్వారా అందిస్తున్న పౌర సేవల్లో ఎదురయ్యే సమస్యలపై స్పందించేందుకు వాట్సాప్‌ గవర్నెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వాట్సాప్‌ సేవల్లో భాగంగా రైతు బజార్లు, నిత్యావసర షాపుల వద్ద కూడా క్యూఆర్ కోడ్ ప్రదర్శించాలని దేశించారు. వాట్సాప్‌ నంబర్‌ 95523 00009కు మెసేజ్ పంపడం ద్వారా కావాల్సిన సేవలు పొందవచ్చన్నారు. ప్రస్తుతం విద్యుత్తు, హాల్‌ టికెట్లు వంటి సేవలు అందుబాటులో ఉంచినట్లు చంద్రబాబు చెప్పారు. మరోవైపు మన మిత్ర కార్యక్రమం కింద తొలి విడతగా మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తోంది. తొలి విడతలో విద్య, దేవాదాయ, ఇంధన, ఏపీఎస్‌ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్‌ తదితర శాఖల్లోని సేవలు అందిస్తున్నారు. సేవలు అందించడంతో పాటుగా ప్రభుత్వం పౌరులకు ఏదైనా సమాచారాన్ని చేరవేయాలంటే ఈ వాట్సప్‌ ద్వారా సందేశాలు పంపించనుంది. తద్వారా ఒకేసారి కోట్ల మందికి సమాచారాన్ని చేరవేయవచ్చని అధికారులు చెప్తున్నారు.