ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇక అప్పటి నుంచి భారతదేశంలో టెస్లా కార్ల ప్లాంట్ గురించి చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఈ రేసులోకి ఇప్పుడు ఏపీ వచ్చి చేరింది. టెస్లా ప్లాంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ అయిన టెస్లా మనదేశంలోకి వచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. అయితే వివిధ కారణాలతో ఆ అడుగులు ముందుకు పడలేదు. అయితే టెస్లా ప్లాంట్ కోసం అనేక రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు టెస్లా ప్లాంట్‌ను తమ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. తాజాగా ఈ రేసులోకి ఆంధ్రప్రదేశ్ కూడా చేరినట్లు తెలిసింది. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా కృషిచేస్తున్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ధి బోర్డు (EDB) ఆంధ్రప్రదేశ్‌ను టెస్లాకు అనువైన గమ్యస్థానంగా మార్చుతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోర్టుల అనుసంధానం, భూమి లభ్యత.. టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు ఉపయోగపడతాయని ఏపీ ప్రభుత్వం తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు 2024 అక్టోబర్‌లోనే టెస్లా కంపెనీతో ఏపీ ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. అప్పట్లో అమెరికాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ టెస్లా సీఎఫ్‌వో వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు. ఈ విషయంపై చర్చించారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్‌ భేటీతో ప్లాంట్ ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మరోవైపు టెస్లా కంపెనీని ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఆఫర్ చేసినట్లు తెలిసింది. అవసరమైన భూమిని సైతం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే టెస్లా కంపెనీ తొలుత కార్ల దిగుమతిపైనే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ తర్వాతే పూర్తి స్థాయి తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ఏ మేరకు వర్కవుట్ అవుతుంది.. టెస్లా కంపెనీ ఏపీకి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీలో ఇప్పటికే కియా కార్ల పరిశ్రమ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలో కియా కార్ల ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ నుంచి ఇప్పటికే కార్ల ఉత్పత్తి, అమ్మకాలు కూడా జరుగుతున్నాయి.