నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయం

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశాలు. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ సభ్యులు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తర్వాత వాయిదాపడనున్నాయి. ఈ నెల 28న ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్ట­నుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ముఖ్యమంత్రి చంద్ర­బాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది.మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ నిర్వహించారు. సభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సరే.. జనసేన పార్టీ సభ్యులు సంయమనం కోల్పోవద్దు అన్నారు.సభలో హుందాగా వ్యవహరించాలని.. బురదలో కూరుకుపోయిన వైఎస్సార్‌సీపీ సభ్యులు దాన్ని మనకూ అంటించాలని చూస్తారన్నారు. వైఎస్సార్‌సీపీ సభ్యుల దిగజారుడు వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దన్నారు. చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో జనసేన పార్టీ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలు, ఆకాంక్షలు, ఆశలను చట్టసభల్లో వినిపించేలా జనసేన పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. చర్చల్లో పాల్గొనాలని సూచించారు పవన్ కళ్యాణ్. సామాన్యుడి గొంతుగా సభలో మాట్లాడాలని శాసనసభ సంప్రదాయాలు, మర్యాద కాపాడుతూ హుందాగా ముందుకు వెళ్దామన్నారు. సమస్యలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుని చర్చల్లో పాల్గొనాలన్నారు. జనసేన పార్టీ సభ్యులంతా బడ్జెట్‌ను అధ్యయనం చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రజాసమస్యలు తెలుసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆ తరహా సమస్యలు ఉంటే వాటన్నింటినీ క్రోడీకరించి మాట్లాడాలి అన్నారు.అసెంబ్లీ సమావేశాల సమయంలో కొన్ని నిషేధాలను అమలు చేస్తున్నారు. సభ్యులు ఎవరూ పీఏలు, వ్యక్తిగత సిబ్బంది, సందర్శకులను అసెంబ్లీ ఆవరణలోకి తీసుకురాకూడదన్నారు. సభ్యులు ఎవరూ సభాప్రాంగణంలో నినాదాలు చేయకూడదని.. ప్లకార్డులు, కరపత్రాలు ప్రదర్శించరాదు, కరపత్రాలు పంచరాదు. 'అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఊరేగింపులు, ప్రదర్శనలు, బైఠాయింపులకు అనుమతి లేదు' అని ప్రకటనలో తెలిపారు.