తల్లికి వందనంపై బిగ్ అప్‌డేట్.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Wait 5 sec.

సంక్షేమ పథకాల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడిన చంద్రబాబు.. సంక్షేమ పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు సహా పలు హామీల గురించి చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. పథకం మే నెలలో అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే.. అంతమందికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.ఇక అన్నదాతలకు మాటిచ్చిన విధంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్న చంద్రబాబు.. పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం ఏడాదికి అందించే ఆరు వేలు సాయంతో పాటుగా రాష్ట్రం నుంచి 14 వేల రూపాయలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20వేలు ఇస్తామన్నారు. ఎన్నికల సమయంలో మాటిచ్చి విధంగా దివ్యాంగులకు పింఛన్ రూ. 3 వేల నుంచి రూ. 6 వేలు పెంచామన్న చంద్రబాబు నాయుడు.. సాధారణ పింఛన్‌ను కూడా రూ. 3 వేల నుంచి 4 వేలకు పెంచిన సంగతి గుర్తు చేశారు. పింఛన్ల కోసం ఏటా రూ. 33 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనేనన్న చంద్రబాబు.. ఉద్యోగులకు కూడా జీతాలు, పెన్షన్లు ఒకటో తేదీనే అందిస్తున్నట్లు వివరించారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు గతంలో తాము అన్న క్యాంటీన్లు తెచ్చామని.. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే మూసివేసిందని చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామన్నారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ పూర్తి చేసి నియామకాలు చేపడతామని చంద్రబాబు ప్రకటించారు. మత్స్యకారులకు అండగా ఉండేందుకు రూ. 20 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి చేస్తే ఆదాయం పెరుగుతుందన్న చంద్రబాబు నాయుడు.. అలా పెరిగిన ఆదాయాన్ని ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు.