స్మశానమే నివాసం.. కంట్లో నిప్పు- కంఠంలో విషం.. శవం అయ్యాకే తెలిసే శివం

Wait 5 sec.

"తల్లి లేదంటారు శివుడికి తల్లి లేదంటారు..తల్లుంటె జడలట్లు కట్టనిచ్చేనా..తల్లుంటె పులితోలు చుట్టనిచ్చేనా..తల్లుంటె విభూది రాయనిచ్చేనా..తల్లుంటె స్మశానాల తిరగనిచ్చేనా..తల్లి లేదంటారు శివుడికి తల్లి లేదంటారు..తల్లి లేని శివుడే అంతటి ఘనుడైతేతల్లి ఉన్న శివడు ఇంకెంత ఘనుడవునో!!"టీవీలో ఈ డైలాగ్ విన్న ప్రతిసారి మదిలో తెలీకుండానే నువ్వుంటే ఓ ఇష్టం మొదలైంది శివయ్యా..! తల్లి లేని బాధ తెలుసు కదా అందుకేనేమో జగత్తు మొత్తానికి తండ్రివయ్యావు!! ఒక విషయం అడుగుతాను ఏమనుకోకు శివయ్యా..! ప్రపంచంలో అందరూ భయపడే ఒకే ఒక్క విషయం చావు కదా.. అది దగ్గరికి వస్తుందనగానే వణికిపోతాం.. కానీ ఆ చావుని కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఏంటయ్యా?.. కాశీ నిండా కనిపించే ఆ దృశ్యం అదే కదా శివా!!అయినా నీకు ఒకటి చెప్పాలయ్యా!! ఈ ఒక్క విషయంలో మాత్రం నీ కంటే నీ భక్తులే గొప్పోళ్లు..! అందరూ భయపడే చావుని కళ్లల్లోకి చూసి దాన్నిరమ్మని పిలిచి ధైర్యంగా చావడం.. గొప్ప లక్షణమే కదా.. బహుశా ఆ లక్షణాన్ని చెప్పే భావనే నువ్వేమో. ఎందుకంటే ఒక కంట్లో నిప్పు.. కంఠంలో విషం.. మెడలో పాము.. ఉండేదా స్మశానం.. పిడికిట్లో మరణం.. ఇంత భయంకరమైన నిన్ను.. మా ఇంట్లో పెట్టుకొని.. మా గుండెల్లో పెట్టుకొని.. మాతో పాటు తోడు తీసుకెళ్తూ.. ప్రతిరోజూ ఓం నమఃశివాయ అంటూ.. ఉంటాం.. ఏంటో కదా..!ఆటగదరా శివ... ఆటగద కేశవ...ఆటగదరా నీకు అమ్మతోడుఆటగద జననాలు ఆటగద మరణాలుమధ్యలొ ప్రణయాలు ఆటగద నీకు...ఆటగద సొంతాలు ఆటగద పంతాలుఆటగద అంతాలు ఆట నీకు..ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపునలుపు తెలుపుల గెలుపు ఆట నీకుఆటగదరా మన్ను ఆటగదరా మిన్నుమిధ్యలో ఉంచి ఆడేవు నన్నుఆటగదరా శివ... ఆటగద కేశవ...ఆటగదరా నీకు అమ్మతోడుఎంత గొప్పగా రాశారు కదా తనికెళ్ల భరణి.. ! వినే ఉంటావ్ కదా శివా!! విని నవ్వుకుంటూ ఉంటావులే.. ! ఎందుకంటే అది కూడా సదా నీకు ఆటే కదా సదాశివా!!కాటుక నల్లని రాతిరి వేళ, గురువుల ఆజ్ఞ తో గుర్తు నెరింగితి..ఉత్తర దిక్కున ఊరిని విడిచితి..పల్లెలు పురములు పట్టణంబులుపేటలు దాటితి.. కోటలు దాటితి..అడుగులు దాటితి.. మడుగులు దాటితి.. అన్నీ దాటితి..బొటను వేలుతో నెత్తురు పొంగగ..పులుపుగ నుదుట విభూతి ధరించితి.. అభిషేకించిన ఆకాశానికి జోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి..మండలంబుగా మాగిన పిమ్మట భైరవుడై ఈ శత్రువుని చంపగ..చూచితి నెవ్వరు చూడని లింగం..నిరూప ధ్రువమగు నిశ్చల లింగం..ఆది తేజమవు ఐక్య లింగం..పురాణ ప్రధమవ్వు పవిత్ర లింగం..శివా!!ఆహా భలే రాశాడు కదా త్రివిక్రమ్ శ్రీనివాస్..! పేరులో కేశవుడైనా శివుడి గురించి గొప్పగా చెప్పాడే! అయినా శివకేశవులకి భేదం లేదంటారు అందుకేనేమో..! కదా శివా!! పలకవేమయా సదా శివా!!చచ్చినవాడు చచ్చిపోతాడనా?చివరిగా ఒక్కటి అడుగుతా చెప్తావా శివా? శుభ్రమైన కైలాసం ఉండగా.. అంత ఐశ్వర్యం ఉండగా.. చింతామణి గృహం ఉండగా.. స్మశానంలో ఎందుకుంటున్నావయ్యా.. శివయ్యా?.. అయ్యయ్యో తెలిసి కూడా అడిగా చూడు.. ఒకసారి పార్వతీ దేవి ఇదే అడిగితే ఇలా చెప్పవంట కదా??"పార్వతీ.. బతికున్నన్నాళ్లూ అన్ని చోట్లకి వెళతారు.. ఏమీ తోచట్లేదు స్మశానానికి వెళ్లొద్దామని ఎవరూ రారు పార్వతీ.. నేనంతవాడిని అంటాడు.. పొడుగ్గా ఉన్నానంటాడు.. తెల్లగా ఉన్నానంటాడు.. పండితుడ్ని అంటాడు.. పద్యాలు నోటికొచ్చు అంటాడు.. ఉపన్యాసాలు చెప్పగలనంటాడు.. నాకు పాటలొచ్చంటాడు.. నాట్యం వచ్చంటాడు.. కవిత్వం వచ్చంటాడు.. నేను అధికారినంటాడు.. అధికారం నాదంటాడు.. నా దగ్గర డబ్బుందంటాడు.. నీకేం తెలుసంటాడు.. ఇన్నీ ఉన్నాయనుకున్నవాడిలో నుంచి ఊపిరి బయటికెళ్లిపోయిన తర్వాత.. వాడిని తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రలతో చేసిన పాడె మీద పడుకోబెట్టి.. చాపచుట్టి.. తాడుకట్టి.. పైన నూలుబట్ట కప్పి.. తీసుకొచ్చి అన్నీ తీసేసి.. కర్రల మీద పడుకోబెట్టి కాల్చేస్తుంటే.. జీవుడు లేచి నిలబడి.. పుర్రె పగిలిపోయిన తర్వాత.. కన్నకొడుకు కూడా స్నానం చేసి వెళ్లిపోతుంటే.. చీకటిపడ్డాక అయ్యబాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు.. నావాళ్లు అన్నవాళ్లు లేరు.. ఇన్నాళ్లూ వీళ్లని నమ్ముకున్నానని ఏడుస్తుంటే.. నేను ఉన్నానురా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చినవాడు వెయ్యి సార్లు మళ్లీ చచ్చిపోతాడని అక్కడున్నాను పార్వతీ" అన్నావంట కదా!! అనే ఉంటావులే.. ! ఎంతైనా భోళా శంకరుడివి కదా!! నెత్తిన చెంబుడు నీళ్లు పోస్తే పొంగిపోతావ్.. నీ భక్తులు కన్నీళ్లు పెట్టుకుంటే కుంగిపోతావ్.. నేనున్నా కదరా అంటూ అభయమిస్తావ్!! ఇక విసిగించనులే.. ఉంటాను.. మళ్లీ కలుద్దాం.. ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ శంభోశంకర!!