మందు బాబులలో పరివర్తన తెచ్చేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతుంటాయి. మందు మానండర్రా అంటూ ఇంట్లో కుటుంబసభ్యులు కూడా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరు పెడుతుంటారు. అయినప్పటికీ మందుబాబులు మారితేనా.. చుక్క కనిపించిందా, గొంతులో పడాల్సిందే అనేంతలా తాగుడుకు బానిసగా మారిపోతుంటారు. అయితే అలాంటి మందుబాబులలో పరివర్తన తెచ్చేందుకు వినూత్న శిక్ష విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ దొరికిన నంద్యాల జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 47 మంది మందుబాబులను గత సోమవారం పోలీసులు ముందు హాజరుపరిచారు. అయితే వీరికి విధించే శిక్షలు వారిలో మార్పు తెచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో న్యాయమూర్తి సరికొత్త శిక్ష విధించారు. మద్యం తాగితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయనే దానిపై వారితోనే అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మద్యం అనర్థాలు, రహదారి నిబంధనలపై మందుబాబులతో అవగాహన కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ 47 మంది మందుబాబుల చేతికి ప్లకార్డులు అందించిన పోలీసులు.. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో వీరిని నిల్చోబెడుతున్నారు. ఈ రకంగా మద్యం అనర్థాలు, రోడ్డు నిబంధనలపై వారితో అవగాహన కల్పిస్తున్నారు. కోర్టు తీసుకున్న నిర్ణయంపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి బహిరంగంగా మద్యం తాగే ఆలోచన, మద్యం తాగి బండి నలిపే ప్రయత్నం చేయరని అభిప్రాయపడుతున్నారు. ఆ రకంగా మద్యం తాగేవారితోనే.. మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారు నంద్యాల పోలీసులు. కర్నూలులో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులుకర్నూలు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడాన్ని నిరోధించేందుకు ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం తాగి వాహనాలు నడపటం సహా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ 13 మంది పోలీసులకు చిక్కారు. వీరిని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు జరిమానా విధించిన కోర్టు.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ దొరికిన వారికి వేయి రూపాయలు చొప్పున జరిమానా విధించింది.