సరికొత్త పథకానికి కేంద్రం శ్రీకారం..! దేశ పౌరులందరికీ సార్వత్రిక పెన్షన్ స్కీమ్.. ఉద్యోగం లేకపోయినా..

Wait 5 sec.

: కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది దేశ పౌరులందరినీ ఉద్దేశించి తీసుకొస్తున్నట్లు సమాచారం. 60 సంవత్సరాలు పైబడిన అందరికీ పెన్షన్ అందించే విధంగా.. సార్వత్రిక పెన్షన్ స్కీమ్‌పై కేంద్రం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఎలాంటి సామాజిక భద్రతా పథకానికి నోచుకోని నిర్మాణ రంగ కార్మికులు, గిగ్ వర్కర్స్ వంటి వారికి కూడా బెనిఫిట్స్ అందించే ఉద్దేశంతో.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాల్ని ఉటంకిస్తూ.. పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుతం సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో (EPFO) చేరే అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ ఏదైనా కంపెనీలో పని చేసే వ్యక్తి వేతనం నుంచి 12 శాతం నుంచి ప్రతి నెలా అతడి ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంది. ఇంకా.. ఆ కంపెనీ కూడా అంతే మొత్తం యాడ్ చేస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం పీఎఫ్ నిధులపై వడ్డీ మాత్రమే చెల్లిస్తుంది. అంతే గానీ ప్రత్యేకంగా ఈపీఎఫ్ ఖాతాకు ప్రభుత్వం ఎలాంటి జమ చేయట్లేదు. ఇంకా అసంఘటిత రంగంలో పనిచేస్తూ.. ఎలాంటి పెన్షన్ పథకాలకు నోచుకోని వారికి.. అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారుల కోసం ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన, ఇంకా రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇలా వేర్వేరు పథకాలు ఉన్నాయి. ఇక్కడ అన్నింట్లోనూ కొంత మొత్తం పౌరులు చెల్లిస్తుంటే.. ప్రభుత్వం ఇక్కడ కొంత చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇన్ని పథకాలు వేర్వేరుగా ఉండే బదులు.. దేశంలోని పౌరులందరికీ కూడా ఒకటే తరహా పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి.. పొదుపు, పింఛన్ పథకాల్ని హేతుబద్ధీకరించి కొత్త పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వారితో పాటుగా.. ఉద్యోగం లేని వారు కూడా ఈ స్కీంలో చేరేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. అంటే ఇక్కడ స్వయం ఉపాధి అవకాశాలు పొందుతున్న వారు కూడా చేరొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్కీంకు సంబంధించిన విధివిధానాలపై కసరత్తు ప్రారంభమైందని.. త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఉంటుందని ఒక అధికారి వెల్లడించారు. అయితే.. నేషనల్ పెన్షన్ స్కీమ్ యథాతథంగానే ఉంటుందని సదరు వర్గాలు తెలిపాయి.