తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నాయకుడు ఏ బాంబు పేలుస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అధికార పార్టీపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే.. ఇప్పుడు కొత్తగా.. సొంత పార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బీసీ రాగం ఎత్తుకుని సొంత పార్టీకి చెందిన ఓ వర్గం వాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మార్గంలోనే నడుస్తున్నారు.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ . సొంత పార్టీలోని ఓ వర్గంపై అంజన్ కుమార్ యాదవ్.. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం (ఫిబ్రవరి 24న) రోజున హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆదర్శనగర్‌లో యాదవ సామాజికవర్గ నేతల సమావేశం నిర్వహించగా.. అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులగణన చేపట్టి బీసీ కులాల లెక్కలు తేల్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. అయితే.. ఈ సందర్భంగా.. అంజన్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు ఎదురైన కొన్ని సందర్భాలను ప్రస్తావిస్తూ.. సొంత పార్టీలోని ఓ వర్గానికి చెందిన నాయకులపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ చెప్పడం వల్లే కులగణన జరిగిందని.. లేకుంటే ఈ కొడుకులు ఎప్పుడు కానిస్తుండే? అంటూ అంజన్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కొడుకులు తెలంగాణనే అడ్డుకున్నారని.. చెప్పుకొచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాంగ్ డిసిషన్ తీసుకుందని.. నిజానికి ఈ సీటును కాంగ్రెస్ పార్టీ యాదవులకు కేటాయిస్తే తప్పకుండా గెలిచేదని అంజన్ కుమార్ తెలిపారు. యాదవులకు ఇవ్వకుండా పార్టీలోనే కొందరు అడ్డు తగిలారని.. యాదవ కులస్తులను కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఇప్పటికీ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.రాజ్యసభ సీటు యాదవులదేనని.. తన కొడుకు పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాజ్యసభ సీటు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తనకు నేరుగా సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ లాంటి వాళ్లు చెప్పడం వల్లే తనకు పీసీసీలో చోటు ఇచ్చారని అంజన్ కుమార్ యాదవ్ కీలక విషయాలు ప్రస్తావించారు. మాజీ పీసీసీ, మాజీ ఎంపీగా చేసినా ఎక్కడ స్వయంగా నిలబడి ఎన్నికల్లో గెలిచింది లేదంటూ వీహెచ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అంజన్ కుమార్ యాదవ్. తనకు ఓడిపోయే సమయంలో వచ్చి ఎంపీ టికెట్ ఇచ్చారని.. గెలిచే సమయంలో ఇవ్వకుండా.. ఇంట్లో కూర్చున్న వ్యక్తిని తీసుకొచ్చి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి చేజేతులా సీటు కోల్పోయేలా చేశారంటూ దానం నాగేందర్‌ను ఉద్దేశించి అంజన్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ భజనగాళ్లు ఇవ్వలేదని.. సోనియా గాంధీతో మాట్లాడి లాలూ ప్రసాద్ యాదవ్ తనను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారంటూ సంచలన విషయాలు వెల్లడించారు. అప్పుడు కూడా తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వకూడదని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి అడ్డు తగిలారని చెప్పుకొచ్చారు. తనకు కేంద్ర మంత్రి పదవి రాకుండా అడ్డుకుంది కూడా ఈ కొడుకులే అంటూ.. ఓ సామాజికవర్గంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.వాళ్లంతా ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. మళ్లీ ఎంపీగా టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తారని.. కానీ తమకు మాత్రం టికెట్ ఇవ్వమంటే కూడా ఇవ్వరని అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఇక నుంచి యాదవ సామాజికవర్గాన్ని తక్కువ చేసి చూసినా.. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఊరుకునే ప్రసక్తే లేదంటూ అంజన్ కుమార్ యాదవ్ ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. క్రమశిక్షణ కమిటీ నోటీసులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేయటంతో.. మరి రాష్ట్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.