: కొద్ది రోజులుగా .. పసిడి ప్రియుల్ని వణికించాయన్న సంగతి తెలిసిందే. దేశీయంగా, అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో వరుసగా పెరుగుకుంటూ పోయాయి. ఈ క్రమంలోనే ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని తాకాయి. దీంతో సామాన్యులకు కొనాలంటేనే కష్టమైంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు.. మరీ ముఖ్యంగా టారిఫ్స్ విధిస్తుండటంతో వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారంపైకి పెట్టుబడులు మళ్లించారు. సాధారణంగానే సంక్షోభ సమయాల్లో బంగారం ఆదుకుంటుందన్న నానుడి ఉంది. దీంతో రేట్లు ఒక్కసారిగా పెరుగుకుంటూ పోయాయి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. వరుసగా జీవన కాల గరిష్ట స్థాయిల నుంచి తగ్గుతున్నాయి. ఇటీవల ఆల్ టైమ్ హై నుంచి ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో పడిపోగా.. ఇప్పుడు మరోసారి మరో కారణంగా బంగారం ధరల్లో ఒక్కసారిగా ఊహించని మార్పు కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో, అదే విధంగా దేశీయ మార్కెట్లలో (MCX) ధరలు సడెన్‌గా దిగొచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే.. ఇవాళ (ఫిబ్రవరి 27న) ఉదయం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10 గ్రాములు) 2920 డాలర్ల స్థాయిలో కదలాడగా.. ఇప్పుడు వార్త రాసే సమయంలో (సాయంత్రం 5.40 గంటలకు) ఇది 2880 డాలర్ల లెవెల్స్‌కు పడిపోయింది. అంటే దాదాపు 40 డాలర్లు పతనమైందని చెప్పొచ్చు. అమెరికా డాలర్ సహా బాండ్ ఈల్డ్స్ భారీగా పుంజుకోవడమే బంగారం ధరలు తగ్గేందుకు ప్రధాన కారణంగా నిలిచిందని నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్ తాజాగా 0.20 శాతంగా పెరగ్గా.. పదేళ్ల యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ కనిష్ట స్థాయిల నుంచి తిరిగి పుంజుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు ఇవి ఆకర్షణీయంగా మారగా.. బంగారం డిమాండ్ తగ్గిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే రేట్లు దిగొచ్చాయి. మరోవైపు మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలోనూ (MCX) బంగారం ధరలు పతనం అయ్యాయి. కమొడిటీ ట్రేడింగ్ జరిగే ఎంసీఎక్స్‌లోనూ బంగారం ధర తగ్గినట్లు చూయిస్తోంది. ఇక్కడ ఇవాళ ఏప్రిల్ కాంట్రాక్టులకు సంబంధించి 10 గ్రాముల మేలిమి బంగారం ధర 0.85 శాతం (రూ. 740) తగ్గి రూ. 85,140 కి చేరినట్లు చూయిస్తోంది. ఇక భవిష్యత్తులోనూ ట్రంప్ ట్రేడ్ పాలసీలు, మాక్రోఎకనామిక్ డేటా, కదలికలు, బాండ్ ఈల్డ్స్ వంటివి.. బంగారం ధరల్ని నిర్ణయించడంలో కీలకంగా వ్యవహరిస్తాయని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కూడా గోల్డ్ రేట్లు తగ్గేందుకు కారణమవుతుందని చెబుతున్నారు. దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి తులం రూ. 80,100 కు చేరింది. కిందటి రోజు కూడా రూ. 250 పడిపోయింది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 440 తగ్గడంతో 10 గ్రాములకు రూ. 87,380 కి దిగొచ్చింది. ఇక ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టగా.. ఇది రేపు (ఫిబ్రవరి 28) ఉదయం 10 గంటల తర్వాత దేశీయ మార్కెట్లలో కనిపిస్తుంది. అంటే దేశీయంగా మళ్లీ అప్పుడు ధరలు తగ్గినట్లు కనిపిస్తుంది.