పాకిస్థాన్ చెత్త రికార్డు.. కెన్యాతో సమానంగా!

Wait 5 sec.

2025 పేరిట సుమారు 30 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై ఓ ఐసీసీ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ నిర్వహణ కోసం ఎన్నో పోరాటాలు చేసిన పాకిస్థాన్.. అంతకంటే ఎక్కువ విమర్శల పాలైంది. స్టేడియాల నిర్వహణ, ఏర్పాట్లు లాంటి విషయాల్లో ఆ దేశ క్రికెట్ బోర్డుపై విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ చాలవన్నట్లు ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన చేసింది. ఫలితంగా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది.డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి దారుణ ప్రదర్శన చేసింది పాకిస్థాన్. సెమీస్ చేరడం అటుంచితే.. కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. విజయం లేకుండానే ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత భారత్‌తో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఇక లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఆ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉంది. కానీ, వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో పాక్.. ఒక్క విజయం కూడా సాధించలేదు. పాకిస్థాన్ చివరగా 1996 వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. గత 23 ఏళ్లలో ఒక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తూ కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించకుండా నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్థాన్‌ చెత్త రికార్డును నెలకొల్పింది. ఐసీసీ నాకౌట్‌ ఈవెంట్‌గా మొదలైన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి టోర్నీ 1998లో బంగ్లాదేశ్‌లో జరిగింది. అయితే అప్పుడు ఆ జట్టు టోర్నీలోనే ఆడలేదు. ఆ తర్వాత 2000లో కెన్యాలో టోర్నీ జరగ్గా.. అప్పుడు ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.ఆ తర్వాత 2002, 2004, 2006, 2009, 2013, 2017లలో ఆతిథ్య దేశాలు కనీసం ఒక్క మ్యాచ్‌లో అయినా గెలిచాయి. కానీ, పాకిస్థాన్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఒక్క మ్యాచ్ గెలవలేదు. దీంతో కెన్యా తర్వాత ఈ టోర్నీని విజయం లేకుండా ముగించిన జట్టుగా పాక్ నిలిచింది. దీంతో పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.