ఏపీలో 'కోనసీమ మోనాలిసా'.. ఆ వీడియో వైరల్ కావడంతో యువకుడిపై కేసు.. ఏం జరిగిందంటే

Wait 5 sec.

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో యువతి మోనాలిసా భోంస్లే గురించి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ సమీప మహేశ్వర్‌‌కు సంబంధించిన మోనాలిసా పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ కొద్దిరోజుల్లోనే సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయ్యారు. ఇదంతా కుంభమేళాలో మోనాలిసా గురించి అయితే.. ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మోనాలిసా అంటూ ఓ యువకుడు చేసిన పనికి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బాలిక ఫోటోతో చిక్కుల్లో పడ్డాడు.. కేసు నమోదైంది.డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సత్తెమ్మతల్లి జాతర ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. ఈ నెల 23న ముమ్మిడివరం మండలం సీహెచ్‌ గున్నేపల్లిలో జాతర నిర్వహించగా.. అక్కడ అమలాపురానికి చెందిన పదో తరగతి విద్యార్థిని పూసలు విక్రయిస్తున్నారు. ఆ బాలికను చూసిన చింతాడగరువుకు చెందిన యువకుడు సత్తి దేవిశ్రీప్రసాద్‌.. వెంటనే ఆమె అనుమతి లేకుండానే వీడియో తీశాడు. అక్కడితో ఆగకుండా ఆ వీడియోను 'కోనసీమలో మోనాలిసా' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది.. దీంతో ఆ బాలికను తోటి విద్యార్థులు టార్గెట్ చేశారు.ఆ బాలికను తోటి విద్యార్థులు ఎగతాళి చేయడంతో మనస్తాపానికి గురైంది. వెంటనే ఆమె పిన్నికి జరిగిన విషయాన్ని చెప్పారు. బాలిక పిన్ని నేరుగా ముమ్మిడివరం పోలీసులకు ఆ వీడియో అంశంపై ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా వీడియో తీసినందుకు ఆ యువకుడిపైకేసు నమోదు చేశారు పోలీసులు. అయితే పదో తరగతి బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం కువైట్ వెళ్లారు.. దీంతో ఆమె అమలాపురంలోని పిన్ని సంరక్షణలో ఉంటూ చదువుకుంటోంది. అనుమతి లేకుండా ఎవరిదైనా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కేసుల్లో ఇరుక్కోక తప్పదంటున్నారు.అటు కుంభమేళా మోనాసలిసాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.. దెబ్బకు ఆమె ప్రయాగ్‌రాజ్‌ నుంచి సొంత ఊరికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. మోనాలిసాకు బాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కింది. త్వరలో తీయబోయే ది డైరీ ఆఫ్‌ మణిపుర్‌లో మోనాలిసాకు ఛాన్స్ ఇస్తానని డైరెక్టర్ సనోజ్‌ మిశ్ర తెలిపారు. ఆమెకు నటనలో శిక్షణ ఇస్తామన్నారు. ఇంకేముంది మోనాలిసా ఫొటోలు, వీడియోలకు సోషల్ మీడియాలో లక్షల కొద్దీ వ్యూస్‌, లైక్స్ వచ్చాయి. కుంభమేళాలో న్యాచురల్ బ్యూటీ అంటూ కొందరు ఆకాశానికి ఎత్తేశారు. ఆమె కోసం సెల్ఫీలు తీసుకునేందుకు జనాలు ఎగబడ్డారు.. ఇదంతా మోనాలిసా అనుమతితోనే జరిగింది. అయితే కోనసీమ ప్రాంతంలో బాలిక వ్యవహారంలో ఇదంతా వేరు.. అందుకే కేసు నమోదైంది. మొత్తం మీద కోనసీమ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.