తల్లికి వందనం, పథకాల అమలుపై ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ హామీలు ఇచ్చింది. కింద.. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000 అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. అలాగే అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20000 అందిస్తామని హామీ ఇచ్చింది. ఇక ఈ హామీలను అమలు చేసేందుకు కూటమి సర్కారు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానిపై ఏపీ విద్యా శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏప్రిల్, మే నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నట్లు నారా లోకేష్ తెలిపారు. అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు వివరించారు. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతి జిల్లాకి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి, అభివృద్ధి వికేంద్రీకరణ చేశామని నారా లోకేష్ తెలిపారు.రెండుసార్లు డీఎస్సీ ఇచ్చామన్న నారా లోకేష్.. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని శాసనమండలిలో చెప్పారు.రూ.200 పింఛను రూ.2 వేలు చేశామని.. అన్న క్యాంటీన్లు తెచ్చామని వివరించారు. పసుపు కుంకుమ, ఆదరణ పథకాలను ప్రవేశపెట్టామన్న నారా లోకేష్.. అభివృద్ధి,సంక్షేమం చేసి చూపించామన్నారు. 2019 - 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా నష్టపోయిందనీ.. కంపెనీలు ఇక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి అంటూ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదని నారా లోకేష్ ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే పింఛన్ పెంచామనీ.. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. చెత్త పన్ను, ల్యాండ్‍ టైటిలింగ్ యాక్టు రద్దు చేశామన్న నారా లోకేష్.. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేంద్రం నుంచి తీసుకురాలేని నిధులను 9 నెలల్లోనే తెచ్చినట్లు చెప్పారు.