మహాకుంభమేళాలో విధులు.. 75 వేల మంది పోలీసులకు సీఎం యోగి అదిరిపోయే గిఫ్ట్

Wait 5 sec.

ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు కొనసాగిన ప్రశాంతంగా ముగిసింది. అన్ని విభాగాల సమన్వయంతో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం విజయవంతంగా ఈ మహాక్రతువును నిర్వహించింది. అయితే, కుంభమేళా విజయవంతం కావడంలో పోలీసుల పాత్ర ఎనలేనిదని వారిపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రశంసలు కురిపించారు. నెలన్నర పాటు సాగిన ఈ వేడుకల్లో కోట్లాది మంది భక్తులను నియంత్రించడం, శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు క్రమశిక్షణగా వ్యవహరించారంటూ ఓ కార్యక్రమంలో ఆయన కొనియాడారు. ఈ క్రమంలోనే కుంభమేళా విధుల్లో పాల్గొన్న దాదాపు 75వేల మంది పోలీసులకు రూ.10 వేల చొప్పున ప్రత్యేక బోనస్‌ ప్రకటించారు. దీంతో పాటు సిబ్బంది సేవలకు గుర్తింపుగా ‘మహాకుంభ్‌ సేవా మెడల్‌’ ప్రదానం చేస్తామని యోగి ప్రకటించారు. అదేవిధంగా వీరికి దశలవారీగా వారం రోజుల సెలవులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేశారు. మౌని అమావాస్య రోజున భక్తులను సమర్థంగా నియంత్రించడం, అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న సమయాల్లో ప్రాణనష్టం జరగకుండా వేగంగా స్పందించడం వంటి అంశాల్లో భద్రత సిబ్బంది సమష్టి కృషిని మరువలేనిదని యూపీ సీఎం కితాబిచ్చారు. ‘మహా కుంభమేళా కేవలం మతవిశ్వాసాలకు సంబంధించిన వేడుక మాత్రమే కాదు. ఆర్థిక అంశాలూ ఇందులో ముడిపడి ఉన్నాయి. కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కోట్లు ఖర్చు చేసింది.. దీనికి ప్రతిఫలంగా ఆర్థిక వ్యవస్థకు రూ.3.5 లక్షల కోట్లు వచ్చి చేరాయి.. మేళాలో పాల్గొన్న వారు మాత్రమే ఈ కార్యక్రమం స్థాయిని అర్థం చేసుకోగలరు. ఎక్కడో కూర్చొని ప్రతికూల వ్యాఖ్యలు చేయడం చాలా సులభం’ అని యూపీ సీఎం వ్యాఖ్యానించారు. జనవరి 13న పుష్య పౌర్ణమితో ప్రారంభమైన మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు. ఏకంగా 66 కోట్లకు పైగా జనాలు అక్కడకు వెళ్లి గంగ, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూపీ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది. పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘం. 15 వేల మంది రాత్రినక, పగలనక 24 గంటలూ విధుల్లో ఉంటూ ఎక్కడా అపరిశుభ్రత లేకుండా చూసుకున్నారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి సైతం ఎక్కింది. అందుకే వారి సేవలకు మెచ్చి యూపీ ప్రభుత్వం బోనస్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.