అమ్మో మాక్స్‌వెల్.. అప్ఘనిస్తాన్ ఆ కాళరాత్రిని మరచిపోలేదు! వీడియో ఇదిగో!!

Wait 5 sec.

భారత్‌తో పేరు చెప్పగానే పాక్ ప్లేయర్లకు వెంటనే గుర్తొచ్చేది విరాట్ కోహ్లి. అలానే ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనగానే అప్ఘన్ ప్లేయర్లు మాక్స్‌వెల్ మిగిల్చిన కాళరాత్రినే గుర్తు చేసుకుంటారు. ఆల్‌మోస్ట్.. ఆల్‌మోస్ట్ కాదు ఇక విజయం ఖరారైపోయింది అనుకునే సమయంలో ఒంటికాలితో మ్యాచ్ గెలిపించేశాడు. అది కూడా అలా ఇలా కాదండోయ్ మనిషి శివాలెత్తితే ఎలా ఉంటుందో అలా ఆడాడు. అందుకే మాక్స్‌వెల్ పేరు చెప్పగానే అప్ఘనిస్తాన్ ప్లేయర్లకు కాళరాత్రే. భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్‌గా నిలిచింది. అసలు ఆస్ట్రేలియా జట్టు అక్కడి వరకూ రావడానికి కారణమైన ఒకే ఒక మ్యాచ్ ఉంది. అదే వరల్డకప్-2023 39వ మ్యాచ్. అప్ఘనిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయింది అనుకున్న సమయంలో మాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో మ్యాచ్‌ని గెలిపిస్తాడు. ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘన్లు 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌పై 177 పరుగులు చేసిన ఇబ్రహీం జర్దాన్ ఆ మ్యాచ్‌లో 129 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు కూడా తమవంతు బ్యాటింగ్ ఆడింది. ఆస్ట్రేలియా ముందు భారీ స్కోర్ ఉంది. కానీ అది ఆ ప్లేయర్లకు తక్కువే. అప్ఘన్లను తక్కువ అంచనా వేసిన ఆసీస్ బ్యాటర్లకు అప్ఘనిస్తాన్ బౌలర్లు షాకిచ్చారు. ఆరంభంలోనే టాప్ ఆర్డర్‌ను మొత్తం కుప్పకూల్చారు. 18.3 ఓవర్లలోనే 91 పరుగులకు ఏడు వికెట్లు తీసేశారు. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, మార్నస్ లబుషేన్, జాస్ ఇన్‌గ్లిస్, మార్కస్ స్టాయినీస్, మిచెల్ స్టార్క్ ఇలా అందరూ వెంటవెంటనే అవుటయ్యారు. అదే సమయంలో క్రీజులో ఉన్న బ్యాట్‌తో వీరంగం సృష్టించాడు. కాలు నరం పట్టేసినా ఫిజియోకి వెళ్లకుండా గ్రౌండ్‌లోనే ఉండి ఒంటికాలుతో శివాలెత్తాడు. ఆస్ట్రేలియా ఓడిపోతుంది అనుకున్న వాళ్లతో కంగారుల దెబ్బేంటో చూయించాడు. 128 బంతుల్లోనే 21 ఫోర్లు, పది సిక్సర్లతో 201 పరుగులు చేసి మ్యాచ్‌ని గెలిపించారు. 91కి ఏడు వికెట్ల నుంచి 293కి 7 వికెట్లు వరకు సాగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్ ఆడిన తీరుకు క్రికెట్ ప్రపంచమే ప్రశంసలతో ముంచెత్తింది. ఐసీసీ వేదికలపై అప్ఘనిస్తాన్ జట్టు మీద మాక్స్‌వెల్‌కి మంచి రికార్డులే ఉన్నాయి. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో కేవలం 39 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2022లో 32 బంతుల్లో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వన్డే వరల్డ్‌కప్ 2023లో 128 బంతుల్లో 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 41 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజ్‌లో ఇవాళ ఆస్ట్రేలియా-అప్ఘనిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో అందరూ ఒక్కసారి మాక్స్‌వెల్‌ని గుర్తు చేసుకుంటున్నారు. మరి ఈరోజు మ్యాచ్‌లో ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.