Latest Fixed Deposit Interest Rates: ఆర్బీఐ ఇటీవల కీలక రెపో రేట్లను చాలా కాలం తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా బ్యాంకులు లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను చాలా వరకు బ్యాంకులు సవరిస్తున్నాయి. ఇక్కడ కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో గతంలో కంటే డిపాజిట్ దారులకు రాబడి తగ్గుతుందని చెప్పొచ్చు. అందుకే బ్యాంకులు ఎఫ్‌డీ వడ్డీ రేట్లు తగ్గించడానికంటే ముందుగానే డిపాజిట్లు చేయడం ఉత్తమం. ఇప్పుడు మనం దేశంలోని ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక ఏడాది వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై దేంట్లో ఎంత వడ్డీ రేట్లు ఉన్నాయి.. ఇక రూ. 5 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేసినట్లయితే మెచ్యూరిటీకి రిటర్న్స్ వస్తాయనేది చూద్దాం. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఏడాది టెన్యూర్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.60 శాతం వడ్డీ రేటు ఉంది. ఇదే సమయంలో సీనియర్ సిటిజెన్లకు చూస్తే 7.10 శాతం వడ్డీ వస్తుంది. ఇక్కడ రూ. 5 లక్షలపై మెచ్యూరిటీకి వీరికి వరుసగా రూ. 31,102; రూ. 33,458 వడ్డీ వస్తుంది. రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకులో సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజెన్లకు వరుసగా సంవత్సరం వ్యవధి FD పై వడ్డీ రేట్లు వరుసగా 6.70 శాతం, 7.20 శాతంగా ఉన్నాయి. ఇక్కడ 5 లక్షలు జమ చేసినట్లయితే రూ. 31,569; రూ. 33,932 వడ్డీ వస్తుంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో పై రెండు బ్యాంకుల కంటే డిపాజిట్లపై వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ వీరికి వరుసగా 7.10 శాతం, 7.60 శాతం మేర వడ్డీ రేట్లు ఉండగా.. 5 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే రూ. 33,458; రూ. 35,810 చొప్పున వడ్డీ అందుతుంది.ఫెడరల్ బ్యాంకులో వరుసగా 7 శాతం (సాధారణ ప్రజలకు), 7.50 శాతం (సీనియర్ సిటిజెన్లకు) వడ్డీ రేట్లు ఉన్నాయి. 5 లక్షలపై ఇక్కడ వరుసగా వడ్డీ రూ. 32,990; రూ. 35,342 వడ్డీ అందుతుంది. ప్రభుత్వ రంగ ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6.85 శాతం, 7.35 శాతం చొప్పున వడ్డీ రేట్లు ఉండగా.. 5 లక్షలు జమ చేస్తే.. మెచ్యూరిటీకి వరుసగా రూ. 32,280; రూ. 34,636 చొప్పున వడ్డీ అందుతుంది. ఇక మరో ప్రభుత్వ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.80 శాతం, 7.30 శాతం చొప్పున వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇక్కడ 5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి రూ. 32,048, రూ. 34,400 వడ్డీ అందుతుంది.