దలైలామాను నేరుగా ఎన్నుకోరు. ఆయన తిరిగి జన్మిస్తారని బౌద్ధులు నమ్ముతారు. కొన్ని సంకేతాల ఆధారంగా తిరిగి జన్మించిన బాలుడి కోసం వెతుకుతారు. అంత్యక్రియల్లో వెలువడే పొగ వ్యాపించే దిశ ఆధారంగా హిమాలయ ప్రాంతంలో ఆ దిశ వైపు ప్రయాణించి.. అదే సమయంలో జన్మించిన కొంత మంది బాలురను గుర్తించి, తమకు కలలో వచ్చిన కొన్ని సంకేతాల ఆధారంగా వారిలో కొన్ని లక్షణాలను గుర్తించి తదుపరి దలైలామాను ఎంపిక చేస్తారు. ఆసక్తికరంగా సాగే ఈ సుదీర్ఘ ప్రక్రియ కారణంగానే.. ప్రస్తుత వారసుడి ఎంపికపై టిబెట్ బౌద్ధ సమాజంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్సుకత నెలకొంది. తదుపరి దలైలామా ఎంపిక విషయంలో భారత్, చైనా మధ్య వివాదం కొనసాగుతుండటంతో ఈ ప్రక్రియపై మరింత ఆసక్తి నెలకొంది.బౌద్ధమతంలో అత్యున్నత ఆధ్యాత్మిక గురువు దలైలామా. ప్రస్తుత దలైలామా తన 90వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఆయన ఎన్నో ఏళ్ల కిందట భారత్‌కు వచ్చేశారు. ఈసారి ఆయన నిర్ణయంపైనే తదుపరి దలైలామా ఎంపిక ఆధారపడి ఉంటుందని బౌద్ధులు తెగేసి చెబుతున్నారు. మరోపక్క.. చైనా మాత్రం కొత్త దలైలామాకు చైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉండాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో అసలు దలైలామా ఎవరు? తదుపరి దలైలామాను ఎలా గుర్తిస్తారు? ఈ విషయంలో భారత్, చైనా మధ్య వివాదం ఏంటి? అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.. బౌద్ధ గురువు దలైలామా ఎవరు?దలైలామా టిబెటన్ బౌద్ధమతంలోని గెలుగ్ శాఖకు చెందిన అత్యున్నత ఆధ్యాత్మిక గురువు. ఆయనను అవలోకితేశ్వర (కరుణామయుడైన బుద్ధుడు) అవతారంగా టిబెటన్ బౌద్ధులు భావిస్తారు. ఆయన బోధనలు, మార్గదర్శకత్వం.. బౌద్ధుల ఆధ్యాత్మిక జీవనానికి, ఆచార వ్యవహారాలకు మూలం. దలైలామా దయ, కరుణ, అహింస, జ్ఞానం వంటి బౌద్ధ ఆదర్శాలకు ప్రతీక. ప్రపంచవ్యాప్తంగా ఆయన శాంతి సందేశాలు, బోధనలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఆయన ఎంపిక ఈ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఆయన 1935 జులై 6న టక్టేసర్ ప్రాంతంలో జన్మించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ 1950లో టిబెట్‌ను ఆక్రమించుకుని.. టిబెటన్లను అణచివేసింది. దీంతో టెన్జిన్ గ్యాట్సో నాయకత్వంలో చైనాపై తిరుగుబాటు జరిగింది. చైనా ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచివేయడంతో దలైలామా 1959 మార్చిలో భారత్‌కు వచ్చారు. నాటి నుంచి ధర్మశాలలో ఉంటున్నారు. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు సందేశం అందిస్తున్నారు.తదుపరి దలైలామాను ఎలా గుర్తిస్తారు?దలైలామా మరణానంతరం, ఆయన మరొకరిగా పునర్జన్మ పొందుతారని టిబెటన్ బౌద్ధులు దృఢంగా విశ్వసిస్తారు. ఈ నమ్మకమే వారసుడి ఎంపిక ప్రక్రియకు పునాది. దలైలామా మరణానంతరం, బౌద్ధ భిక్షువుల్లోని పెద్దలు.. ఆయన పునర్జన్మగా భావించే ఓ చిన్నారి కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ కేవలం అదృశ్య సంకేతాలు, ఆసక్తికరమైన సంప్రదాయాల కలయిక.ఆధ్యాత్మిక సంకేతాల అధ్యయనం:ఈ అన్వేషణకు ముందు, బౌద్ధ భిక్షువులు కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలను లోతుగా అధ్యయనం చేస్తారు.తదుపరి దలైలామాను గుర్తించే క్రమంలో భిక్షువులకు వచ్చే కలలలోని దృశ్యాలను విశ్లేషిస్తారు.దలైలామా కన్నుమూసిన సమయంలో ఆయన మృతదేహం ఏ దిశలో ఉంది, ఏ ముద్రలో ఉన్నారు అని గమనిస్తారు.దలైలామా దహన సంస్కారాల సమయంలో.. వెలువడే పొగలు వ్యాపించిన దిశను కూడా ఒక ముఖ్యమైన సంకేతంగా బౌద్ధులు భావిస్తారు.తదుపరి దలైలామా ఏ దిశలో లేదా ఏ ప్రాంతంలో జన్మిస్తారో తెలుసుకోవడం కోసం ఇలాంటి సంకేతాలన్నింటినీ విశ్లేషిస్తారు.లామో లాత్సో సరస్సు మర్మం..టిబెట్ రాజధాని లాసాకు 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న లామో లాత్సో సరస్సుకు ఈ ఎంపిక ప్రక్రియలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. తదుపరి దలైలామాకు సంబంధించిన సంకేతాలు ఈ సరస్సు నీటిలో కనిపిస్తాయని ఇక్కడ ధ్యానం చేసే భిక్షువులు విశ్వసిస్తారు.దలైలామా వారసుడి అన్వేషణఈ సంకేతాలన్నింటి ఆధారంగా, భిక్షువులతో పాటు ఒక అధికారులు బృందం టిబెట్ హిమాలయ ప్రాంతాల్లో పర్యటిస్తుంది. దలైలామా కన్నుమూసిన సమయంలో జన్మించిన పిల్లల కోసం ఈ బృందం అశ్వేషిస్తుంది. ముఖ్యంగా అసాధారణ తెలివితేటలు, లక్షణాలు కలిగిన పిల్లల కోసం చూస్తారు. గతంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను గుర్తు చేసుకోగలిగిన పిల్లల కోసం వెతుకుతారు.పరీక్షలు - పునర్జన్మ నిర్ధారణఇలా గుర్తించిన కొంత మంది పిల్లలకు కొన్ని పరీక్షలు పెడతారు. ఈ పిల్లలకు కొన్ని వస్తువులు ఇస్తారు. ఇందులో మునుపటి దలైలామాకు చెందిన వస్తువులతో పాటు వేరే వస్తువులను కూడా ఉంచుతారు. సరైన వస్తువులను గుర్తించిన పిల్లాడిని దలైలామా పునర్జన్మ పొందిన చిన్నారిగా ఎంపిక చేస్తారు. ఒకవేళ ఆ చిన్నారి గత దలైలామాకు చెందిన ప్రదేశాలను, వస్తువులను, సన్నిహితులను గుర్తిస్తే, వీటిని మరింత బలమైన సంకేతాలుగా భావిస్తారు బౌద్ధులు.ఈ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత, జ్యోతిష్కులు వివరాలన్నింటినీ విశ్లేషించి.. లోతైన ఆధ్యాత్మిక చర్చలు నిర్వహిస్తారు. ఈ సంకేతాలు ఏ చిన్నారిని సూచిస్తాయో, ఆ పిల్లాడినే కొత్త దలైలామాగా అధికారికంగా ప్రకటిస్తారు. ఆ చిన్నారిని దలైలామాగా ప్రకటించాక.. ఒక మఠానికి తీసుకువెళ్లి బౌద్ధ విద్య, ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తారు. కొన్నేళ్ల అభ్యాసం తర్వాత, ఆయన దలైలామా బాధ్యతలను స్వీకరిస్తారు.సాధారణంగా ప్రస్తుత దలైలామా కన్నుమూసిన తర్వాత.. తదుపరి దలైలామా గుర్తింపు ప్రక్రియ మొదలువుతుంది. కానీ, ఇప్పుడు ఆ సంప్రదాయంలో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత దలైలామా జీవించి ఉండగానే ఆయన పునర్జన్మ పొందిన బాలుడి గురించి ఎలా వెతుకుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే తాను జీవించి ఉన్నప్పుడే తన వారసుడి పేరును ప్రకటిస్తానని ప్రస్తుత దలైలామా స్వయంగా ప్రకటించారు. దీనివల్ల ఎంపిక ప్రక్రియ సులభంగా మారుతుందని భావిస్తున్నారు. తన వారసుడి ఎంపిక కోసం 14వ దలైలామా కొన్ని సంకేతాలు ఇచ్చి, మరికొన్ని సూచనలు చేస్తారని అంచనా. ఆదివారం (జులై 6) జరగబోయే దలైలామా 90వ పుట్టిన రోజు వేడుకల్లోనే.. దలైలామా తన వారుసుడి గురించి సంకేతాలు ఇస్తారని వార్తలు వస్తున్నాయి.దలైలామా వాదనద, ఇందులో ఎవరి జోక్యం ఉండదని ఆయన ఇంతకుముందే స్పష్టం చేశారు. తన వారసుడు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం దలైలామా ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దలైలామా వారసుడి నియామకంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం తమకే ఉందని చెబుతోంది. తదుపరి దలైలామాకు చైనా ప్రభుత్వ తుది ఆమోదం ఉండాలని పట్టుబడుతోంది. టిబెట్ తమ దేశంలో విడదీయరాని భాగమని, కాబట్టి అక్కడి మతపరమైన వ్యవహారాల్లోనూ తమదే తుది నిర్ణయం అని చైనా అంటోంది. ఈ వివాదం భారత్, చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చైనా వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ.. తదుపరి దలైలామా ఎంపిక.. ప్రస్తుతం దలైలామా, టిబెటన్ బుద్ధిజం మత ఆచారాల ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. 11వ పంచెన్ లామా అదృశ్యం.. ఆయన ఎక్కడ ఉన్నారు?1995లో 11వ పంచెన్ లామా (రెండో అతిపెద్ద బౌద్ధ గురువు) ఎంపిక విషయంలో చైనా జోక్యం చేసుకుని, దలైలామా.. గుర్తించిన బాలుడిని అదృశ్యం చేసింది. ఆ బాలుడిని బీజింగ్ సమీపంలో ఒక చోట బంధించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం చైనా తమకు అనుకూలంగా ఉన్న వారిని "గోల్డెన్ ఉర్న్ (Golden Urn system)" పద్ధతి ద్వారా నియమించింది. అదే పద్ధతిని దలైలామా వారసుడి విషయంలోనూ అమలు చేయాలని చూస్తోంది. "గోల్డెన్ ఉర్న్" పద్ధతిని తిరిగి ఉపయోగించి తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాలని చైనా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల కూడా మరోసారి ఈ అంశాన్ని చైనా తెరపైకి తెచ్చి.. దలైలామా ఎంపిక ప్రక్రియ తమ తుది ఆమోదానికి కట్టుబడి ఉండాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. దలైలామా విషయంలో భారత్ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. దలైలామా వారసుడి ఎంపిక కేవలం ఒక మతపరమైన ప్రక్రియ మాత్రమే కాదు, ఇది టిబెటన్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, చైనా అణచివేతపై వారి స్వాతంత్ర్య కాంక్షకు ప్రతీక. ప్రస్తుత దలైలామా తన వారసుడిని చైనా వెలుపలే ఎంపిక చేస్తానని స్పష్టం చేయడం, టిబెటన్ల మత స్వేచ్ఛను, సాంస్కృతిక గుర్తింపును కాపాడటానికి ఆయన చేస్తున్న పోరాటానికి నిదర్శనం. 90వ పుట్టిన రోజు నాడు ప్రస్తుత దలైలామా చేసే ప్రకటనలే.. భవిష్యత్తులో చాలా కీలకం కానున్నాయి. ఈ వారసత్వ పోరాటం ఎలా మారుతుంది..? టిబెటన్లకు న్యాయం జరుగుతుందా..? చైనా ఎప్పట్లాగే తన పంతం నెగ్గించుకుంటుందా? అనే అంశాలు కొత్త దలైలామా ఎంపిక ప్రక్రియను మరింత ఉత్కంఠగా మార్చాయి.