AIR Review - టాప్ ర్యాంక్ కొట్టిన టీం

Wait 5 sec.

కోర్ట్ తరువాత హర్ష్ రోషన్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. అప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అనుకుంటే.. ఆ తరువాత వస్తున్న ప్రాజెక్టులన్నీ ఒకెత్తు. ఇక ఇప్పుడు హర్ష్ ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ ‘ఎయిర్’ (AIR - ఆల్ ఇండియా ర్యాంకర్స్). ఈ సిరీస్‌లో సందీప్ రాజ్ నటిస్తూ నిర్మాతగా వ్యవహరించారు. ఇక 90స్ కిడ్స్ నోస్టాల్జిక్ మూమెంట్లతో తీసిన ఈ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతోంది. కాంట్రవర్సీలకు కూడా దారి తీస్తోంది. అసలు ఈ సిరీస్‌లో మ్యాటర్, వివాదం ఏంటో ఓ సారి చూద్దాం.కథAIR సిరీస్‌ అంతా కూడా ఓ పదిహేనేళ్ల క్రితం జరిగే కథ. అప్పట్లో ఇంటర్మీడియట్ చదువులు ఎలా ఉండేవి.. పిల్లల మీద ఎంత ఒత్తిడి ఉండేది.. పిల్లల చదవు కోసం తల్లిదండ్రులు పడే తపన అనే పాయింట్ చుట్టూ జరుగుతుంది. AIR - ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే ఇన్ స్టిట్యూషన్.. ర్యాంకులే పరమావధిగా లక్షల్లో ఫీజులు తీసుకుంటూ ముందుకు సాగుతుంటుంది. మంచి భవిష్యత్తు దొరుకుతుందని ఎంతో మంది తల్లిదండ్రులు ఆ ఇన్ స్టిట్యూషన్‌లో తమ పిల్లల్ని జాయిన్ చేస్తారు. ఇక ఈ ఇన్ స్టిట్యూషన్‌లోకి అర్జున్ (హర్ష్ రోషన్), ఇమ్రాన్, రాజు అనే ముగ్గురు స్టూడెంట్లు జాయిన్ అవుతారు. తన ప్రేయసి జయశ్రీ ఎయిర్ అనే ఇన్ స్టిట్యూట్‌లోనే జాయిన్ అవుతుందని అనుకుని అర్జున్ కూడా వచ్చేస్తాడు. లక్షల్లో ఫీజు కట్టలేని స్థాయి కాకపోయినా అర్జున్ ఇష్ట ప్రకారం అంత పెద్ద కాలేజ్‌లో జాయిన్ చేయాలని అతని తండ్రి భావిస్తాడు. ఇక అక్కడ ఫీజు కట్టేలోపు తన ప్రేయసి జాయిన్ కాలేదని అర్జున్ తెలుసుకుంటాడు. అలా ఆ కాలేజ్ నుంచి ఎలాగైనా వెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక మరో వైపు ఇమ్రాన్ ఓ కుగ్రామం నుంచి వస్తాడు. పదోతరగతిలో 570కి పైగా మార్కులు సాధించి, ఎగ్జామ్ రాసి ఫ్రీ సీట్ కొట్టేసి కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. కానీ ఆ వాతావరణానికి ఇమడలేక అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు. ఇక రాజుది డబ్బులు బాగా ఉండే ధనవంతుల కుటుంబం. కొడుక్కి ఇష్టం లేకపోయినా, అంత చదువు రాకపోయినా సరే పెద్ద కాలేజ్‌లో, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్, ఐఐటీ అంటూ రాజుని జాయిన్ చేస్తాడు. అమ్మను వదిలి ఉండలేని రాజు.. ఆ కాలేజ్ నుంచి బయటకు రావాలని అనుకుంటారు. అలా ఈ ముగ్గురు ఆ కాలేజ్‌లో ఓ గూటికి చేరి AIR అర్జున్, ఇమ్రాన్, రాజు అన్నట్టుగా మారుతారు. ఆ ముగ్గురు కలిసి కాలేజ్ నుంచి బయటకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఏంటి? మళ్లీ కాలేజ్‌లోనే ఉండాలని ఎందుకు అనుకున్నారు? అందరి చేత చీటర్స్ అని ఎందుకు అవమానాలు ఎదుర్కొన్నారు? బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్‌గా ఉన్న ఈ ముగ్గురు చివరకు టాప్ ర్యాంకర్స్ అవుతారా? అన్నదే ఈ సిరీస్.ఈ సిరీస్‌ను ఇప్పటి తరం చూసినా, 90స్ కిడ్స్ చూసినా బాగా కనెక్ట్ అవుతారు. కాకపోతే ఇప్పటి పిల్లలు టెక్నాలజీతో ఎక్కువగా మమేకం అయి ఉన్నారు. అప్పటి వారికి టెక్నాలజీ అంతగా తెలీదు. సోషల్ మీడియా వాడకం ఇంతగా లేదు. అలాంటి చిన్న చిన్న మార్పులే కనిపిస్తుంటాయి ఈ సిరీస్‌లో. ఎయిర్ సిరీస్‌ను ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టుగా మల్చినట్టు అనిపిస్తుంది. ఈ కథను చూపించేది 2010 టైం లైన్‌లో అయినా కూడా డైలాగ్స్ మాత్రం ప్రస్తుతం మీమర్స్, ట్రోలర్స్ వాడే ట్రెండీ పంచ్ లైన్స్‌. అదే ఈ సిరీస్‌కు కాస్త అతికినట్టు అనిపించదు.కార్పోరేట్ చదువుల్లో పడి స్టూడెంట్స్ ఎలా చితికి పోతారు.. స్వేచ్ఛగా విహరిస్తూ, ఆలోచించాల్సి వారి మెదళ్లు ఎందుకు అలా పంజరంలో పెట్టి పాడు చేస్తారు.. బీదరికాన్ని అనుభవించే వారు సైతం పిల్లలకి ఉన్నతమైన చదువులు ఇప్పించాలని పడే తాపత్రయం.. పిల్లల చదువు కోసం సర్వం త్యాగం చేసే తల్లిదండ్రుల బాధను ఇలా అన్నింటినీ ఇందులో చూపించారు. ఇక కార్పోరేట్ విద్యలో ఉండే దోపిడీని కూడా సెటైరికల్‌గా చూపించే ప్రయత్నం చేశారు.ఇక ఈ కథ బ్యాక్ డ్రాప్ అంతా కూడా విజయవాడలోనే ఉంటుంది. అప్పట్లో విజయవాడ క్యాంపస్‌లకు ఓ క్రేజ్ ఉండేది. అక్కడ చదివితేనే ర్యాంకులు వస్తాయనే భ్రమలో అంతా ఉండేవారు. ఇక ఈ సిరీస్‌లో కొన్ని సీన్లపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులో ఓ వర్గం, కులం గొప్పదనం చెప్పినట్టుగా.. హాస్టల్‌లో స్టూడెంట్స్ కూడా వర్గాలుగా విడిపోయినట్టుగా చూపించారు. ఇక ఇందులో అలాంటి కొన్ని సీన్లు, ఓ వర్గాన్ని గొప్పగా చూపించిన సీన్లపై ఇప్పుడు వివాదం జరుగుతోంది. ఆ సీన్లను తొలగిస్తున్నామని కూడా టీం చెప్పేసింది.ఆ హీరో ఈ హీరో.. ఆ కులం.. ఈ కులం.. మా వాడు.. మీ వాడు అంటూపెట్టిన సీన్లు, డైలాగ్స్ ఇప్పుడు మరింత వివాదంగా మారుతున్నాయి. ఆ కూల్ డ్రింక్‌ను మాత్రం మనం అస్సలు తాగకూడదురోయ్ అంటూ చెప్పించిన డైలాగ్స్ కూడా అగ్గిరాజేస్తున్నాయి. అలాంటి అభ్యంతకర సన్నివేశాలు, డైలాగ్స్‌ను తీసేసి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే టీం చేసింది.చదువులు, ర్యాంకులు ఒత్తిళ్లు తట్టుకోలేక స్టూడెంట్స్ ఏమైనా అనుకోని నిర్ణయాలు తీసుకుంటే ఎవరిది బాధ్యత? సూసైడ్ చేసుకుంటే తప్పు ఎవరిది? అన్నట్టుగా ఈ సిరీస్‌లో అంతర్లీనంగా చూపించారు. ర్యాంకులే పరమావధిగా పిల్లల్ని, స్టూడెంట్లను చూడకూడదని, ఎవరి టాలెంట్ వారికి ఉంటుందని, ఒక దాంట్లో సరిగ్గా లేడని పూర్తిగా చేతకాని వాడు, తెలివి లేని వాడు అని అనకూడదు అంటూ ఓ మంచి మెసెజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.కాలేజ్ చదువులు, హాస్టల్, మెస్, వార్డెన్, ఇంఛార్జీ, ఫ్యాకల్టీతో ఉండే ఎమోషన్‌ను ఇందులో చక్కగా చూపించారు. బాత్రూం ఏరియాలో జరిగే కొన్ని ఫన్నీ సీన్లు కూడా బాగుంటాయి. మొత్తంగా ఏడు ఎపిసోడ్స్ ఉంటే.. అందులో నాలుగు దాదాపుగా సరదాగా, ఫన్నీగా, కామెడీగా సాగుతాయి. ఇక చివరి మూడు ఎపిసోడ్స్ మాత్రం సీరియస్ మూడ్‌లోకి వెళ్తాయి. కొన్ని చోట్ల అవే సీన్లు రిపీట్ అయినట్టుగా.. అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ చివరి వరకు ఎంగేజింగ్‌గా, ఎంటర్మైనింగ్‌గా చెప్పడంలో మేకర్లు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు.నటీనటుల విషయానికి వస్తే అర్జున్, ఇమ్రాన్, రాజు పాత్రలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఈ ముగ్గురు కలిసి చేసే కోతి చేష్టలు చాలా మందికి రిలేట్ అవుతాయి. ఇక మిగిలిన స్టూడెంట్స్‌లో కొన్ని పాత్రలు కూడా మెప్పిస్తాయి. బీవీఎస్ అంటూ మ్యాథ్స్ టీచర్‌గా వైవా హర్ష మెప్పిస్తాడు. ఫిజిక్స్ టీచర్‌గా కాస్త ఆలస్యంగానే ఎంట్రీ ఇచ్చినా కూడా సూర్య పాత్రలో చైతన్యరావు ఆకట్టుకుంటారు. చదువుని చదువులా కాకుండా ఆటలా, వినోదంగా చెప్పి అందరిలోనూ చదువు పట్ల ఆసక్తిని పెంచే ఆ సూర్య పాత్ర బాగుంటుంది. ప్రిన్సిపాల్‌గా సందీప్ రాజ్ ఓ రాక్షసుడిలా నటించాడు. అతని పాత్ర, నటించిన తీరు ఆకట్టుకుంటుంది. సునీల్ అక్కడక్కడా కనిపిస్తాడంతే. పిల్లల పేరెంట్స్ పాత్రలు కూడా అందరికీ రిలేట్ అవుతుంటాయి.టెక్నికల్‌గా చూసుకుంటే ఈ సిరీస్ మెప్పిస్తుంది. మ్యూజిక్ సీన్లకు తగ్గట్టుగా సాగుతుంటుంది. కెమెరా వర్క్ సహజంగా ఉంటుంది. అందరినీ ఓ పదిహేనేళ్లు వెనక్కి తీసుకునేలా చేసిన సెటప్ ఆకట్టుకుంటుంది. ఇక ఇందులోని డైలాగ్స్ కొన్ని చోట్ల ఇబ్బంది కరంగా ఉంటుంది. ఇప్పుడు వాడుతున్న ట్రెండీ డైలాగ్స్.. మీమ్స్ డైలాగ్స్.. అప్పుడు ఎలా వాడారో అన్నది అర్థం కాదు. ఇక ఇలాంటి లాజిక్స్ పట్టుకుంటే కాస్త కష్టమే అనుకోండి. పిల్లల్ని ఎలా పెంచాలి.. ఎలా పెంచకూడదు?.. తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించకూడదు? పిల్లలు సైతం తల్లిదండ్రుల్ని ఎలా అర్థం చేసుకోవాలి.. పేరెంట్స్ కష్టాన్ని ఎలా గుర్తించాలి.. గౌరవించాలి? అన్న విషయాల్ని ఇందులో చక్కగా చూపించారు. ఒకటి రెండు సీన్లు కాస్త ఇబ్బంది కరంగా అనిపించొచ్చు. పిల్లలు, తల్లిదండ్రులు అంతా కలిసి చూడాల్సిన సిరీస్ ఇది. రెండో సీజన్‌ అంటూ మళ్లీ సందడి చేసేందుకు ఈ మిత్రత్రయం రాబోతోన్నట్టుగా హింట్ అయితే ఇచ్చారు.