భారత మార్కెట్లను కొల్లగొట్టిన అమెరికా కంపెనీ.. రూ.44 వేల కోట్ల అక్రమార్జన.. సంచలన విషయాలు

Wait 5 sec.

: దేశీయ స్టాక్ మార్కెట్లో అక్రమంగా వేల కోట్ల రూపాయలు ఆర్జించింది అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ గ్రూప్. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ విచారణలో సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో జేన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థపై సెబీ నిషేధం విధించింది. స్టాక్ మార్కెట్లలో ఆయా రంగాల సూచీల ధరలను ప్రభావితం చేసి ఇన్వెస్టర్ల సొమ్మును కొల్లగొట్టినట్లు సెబీ విచారణలో తేలింది. జేన్ స్ట్రీట్ సుమారు రూ.44,358 కోట్లు అక్రమంగా లాభం పొందినట్లు సెబీ నిర్ధారించింది. స్టాక్ ఫ్యూచర్స్‌లో రూ.7208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్ లో రూ.191 కోట్లు, నగదు విభాగంలో రూ.288 కోట్లు పోగొట్టుకున్నట్లు సెబీ తెలిపింది. ఈ నష్టాలను మినహయిస్తే నికరంగా రూ.36,671 కోట్ల మేర అక్రమంగా సంపాదించినట్లు గుర్తించింది. అందులో రూ.483 కోట్లు జరిమానాగా చెల్లించాలని సెబీ ఆదేశించింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సెబీ ఇంత పెద్ద మొత్తాన్నీ జరిమానా విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జేన్ స్ట్రీట్ గ్రూప్ కంపెనీలైన జేఎస్ఐ ఇన్వెస్ట్‌మెంట్స్, జేఎస్ఐ 2 ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ కంపెనీలపై నిషేధం ఉంటుంది. ప్రొప్రైటరీ ట్రేడింగ్ సేవలు అందించే జేన్ స్ట్రీట్ గ్రూప్ 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లో జేన్ స్ట్రీస్ సంస్థ సేవలందిస్తోంది. 2000 మంది వరకు సిబ్బంది పని చేస్తున్నారు. మన దేశంలో ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. స్టాక్ మార్కెట్లలో నగదు విభాగంతో పాటుగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల ట్రేడింగ్ కార్యకలాపాల ద్వారా ఇండెక్స్ ధరలను కృత్రిమంగా హెచ్చు తగ్గులకు లోను చేసినట్లు తేలింది. ఇలా చేయడం ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించే విధానాలను ఈ సంస్థ అమలు చేసినట్లు తేలింది. ఈ కంపెనీ 2023 జనవరి నుంచి 2025 మే నెల కాలంలో నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో భారీ ట్రాన్సాక్షన్లు సాగించింది. దాని ద్వారా ఇండెక్స్ హెచ్చుతగ్గులను ప్రభావితం చేసింది. సెబీ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్టాక్ ఎక్స్చేజీల్లో ట్రేడింగ్ ప్రారంభించగానే జేన్ స్ట్రీట్ గ్రూప్ తమ సంస్థల ద్వారా బ్యాంక్ నిఫ్టీలో ఉన్న షేర్లను నగదు, ఫ్యూచర్లలో భారీగా కొనుగోలు చేపడుతుంది. దీని ద్వారా ఆ షేర్ల ధరలు పెరుగుతాయి. ఈ మేరకు బ్యాంక్ నిఫ్టీ ధర పెరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఆ షేర్లను ఒకేసారి అమ్మేస్తుంది. దీంతో ధరలు పడిపోతాయి. ఈ విషయం ముందే తెలుసు కాబట్టి ఇండెక్స్ ఆప్షన్లలో పొజిషన్లు తీసుకుని క్యారీ చేస్తుంది. ఈ పొజిషన్లను విక్రయించి భారీగా లాభాలు అందుకుంటుంది. అలాగే ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఎక్స్ పైరీ రోజు ట్రేడింగ్ ముగిసే చివరి 2- 3 గంటల్లో బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ షేర్లు, ఫ్యూచర్స్‌ను భారీగా కొనడం, అమ్మడం చేస్తుంది. దీంతో బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఇండెక్స్ ధరలు ఒక్కసారిగా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ఈ ధరలకు అనుగుణంగా ఆప్షన్లు కొనడం, అమ్మడం చేస్తూ లాభాలు ఆర్జిస్తుంది. అయితే ఈ క్రమంలో నగదు విభాగం, ఫ్యూచర్స్ విభాగంలో కొంత నష్టపోతుంది. కానీ, దానికి ఎన్నో రెంట్లు అధికంగా ఆప్షన్లలో లాభాలు ఆర్జిస్తుంది. ఇలా అక్రమంగా భారీగా ఆర్జిస్తున్నట్లు సెబీ గుర్తించింది.