వైభవ్ సూర్యవంశీ 143.. ఇంగ్లండ్‌పై భారత్ భారీ స్కోర్!

Wait 5 sec.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్ 19 మ్యాచ్‌లో బాస్ బేబీ సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లోనే శతకం బాదిన సూర్యవంశీ 143 పరుగులతో రికార్డ్ బ్రేక్ ఇన్నింగ్స్ ఆడాడు. వొర్సెస్టర్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్ - ఇండియా అండర్ 19 మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ హీరో వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల వయస్సులోనే రికార్డులను తన సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో 35 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్ 19 మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ మ్యాచ్‌లో 78 బంతులు ఆడిన సూర్యవంశీ 13 ఫోర్లు, పది సిక్సర్లతో 143 పరుగులు చేసి అవుటయ్యాడు. ఐదు వన్డేల సిరీస్‌లో మొదటి వన్డేలో 48 పరుగులు చేసిన వైభవ్, రెండో వన్డేలో 45 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీతో పాటు విహాన్ మల్హోత్ర కూడా సెంచరీతో రాణించడం విశేషం. ఓపెనర్ ఆయుష్ మాత్రే 14 బంతుల్లో కేవలం ఐదు పరుగులు చేసి అవుట్ కాగా.. వైభవ్ సూర్యవంశీ, రెండో వికెట్‌కు ఏకంగా 219 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విహాన్ మల్హోత్రా 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్లతో 129 పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్ అభిగ్యాన్ కుందు 33 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత యుధాజిత్ గుహా 11 బంతుల్లో 15 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్స్‌కే పెవిలియన్ బాట పట్టారు. ఆయుష్ మాత్రే 5, రాహుల్ కుమార్ 0, హర్‌వన్ష్ పంగాలియా 0, కనిష్క్ చౌహాన్ 2, ఆర్ఎస్ అంబరీష్ 9, దీపేష్ దేవేంద్రన్ 3, నమన్ పుష్కక్ 2 పరుగులు చేశాడు. వైభవ్, విహాన్ సెంచరీలతో రాణిండంతో భారత జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది.