HMDA 2050 మెగా మాస్టర్‌ప్లాన్‌.. పరిధి 10 వేల కి.మీలకు పెంపు, త్వరలోనే..

Wait 5 sec.

హైదరాబాద్ విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో మౌళిక వసతుల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు వచ్చే 30 ఏళ్ల కాలానికి సంబంధించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికను పర్యవేక్షిస్తోంది. ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా HMDA మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించనుంది. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (CMP): భవిష్యత్తులో నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ ఎలా ఉండాలనే దానిపై అధ్యయనం చేస్తుంది.ఎకనమిక్ డెవలప్‌మెంట్ ప్లాన్ (EDP): ప్రజల ఆదాయ మార్గాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది.గ్రీన్ బ్లూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ (GBEP): నీటి వనరులు, చెరువులు, అడవుల రక్షణ, అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది.ఈ మూడు అంశాలపై ఇప్పటికే జరుగుతున్న అధ్యయనాల నివేదికలు త్వరలో అందనున్నాయి. వీటి ఆధారంగా ప్రధాన మెగా మాస్టర్‌ప్లాన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్న ఐదు రకాల మాస్టర్‌ప్లాన్‌లను ఈ కొత్త మెగా మాస్టర్‌ప్లాన్‌లో విలీనం చేసి ఒకే ప్రణాళికను అందుబాటులోకి తేనున్నారు. గ్లోబల్ స్థాయిలో పేరున్న కన్సల్టెన్సీలను ఎంపిక చేసేందుకు ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.ప్రస్తుతం 7,257 చ.కి.మీ. ఉన్న హెచ్ఎండీఏ విస్తీర్ణం 10,472.72 చ.కి.మీ.లకు విస్తరించనుంది. కొత్తగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలకు హెచ్ఎండీఏ పరిధి పెరగనుంది. రీజినల్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత 2 కి.మీ.ల వరకు కిందకు వస్తుంది. ఈ మొత్తం ప్రాంతానికి పకడ్బందీగా జియో మ్యాపింగ్ చేయనున్నారు. జియో రిఫరెన్స్ వ్యవస్థతో ఎలాంటి లోపాలు లేకుండా మాస్టర్‌ప్లాన్ రూపకల్పన జరుగుతుందని అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధి పెరగడంతో సంస్థ పునర్వ్యవస్థీకరణ కూడా అవసరం. ఎక్కడెక్కడ స్థానిక జోన్లు ఉండాలి, ఎంత మేరకు సిబ్బంది అవసరం, వారి అధికార పరిధి వంటి అంశాలపై కన్సల్టెన్సీ ద్వారా అధ్యయనం చేయించి తుది నివేదిక రూపొందించనున్నారు.మాస్టర్‌ప్లాన్‌లో అత్యంత కీలకమైన బాధ్యతను కూడా కన్సల్టెన్సీకి అప్పగిస్తారు. వివిధ నగరాల్లో స్థానిక అభివృద్ధి ప్రణాళికలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు మేలు చేసే విధానాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ మాస్టర్‌ప్లాన్ ముసాయిదా ప్రణాళికను రూపొందించిన తర్వాత ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టి ఆ తర్వాత పూర్తిస్థాయి మాస్టర్‌ప్లాన్‌ను ప్రకటిస్తారు. ఇది హైదరాబాద్ భవిష్యత్తు అభివృద్ధికి ఒక సమగ్ర మార్గదర్శకం కానుంది.