తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, హెచ్చరికలు జారీ

Wait 5 sec.

తెలంగాణకు అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిజామాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని.. 30 నుంచి 40 కి.మీ. వేగంతో కూడా అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటిగ్రేడ్, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా ఉంటుందన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని సాయంత్రం తర్వాత వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కురిసిన మోస్తరు వర్షాలు కాస్త ఆశలు చిగురింపజేసినా.. రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులు పత్తి పంటకు మాత్రమే కొంత వరకు ఊపిరి పోస్తున్నాయి. 25 రోజుల క్రితం వరి నార్లు పోసిన రైతులు, అలాగే జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలు చల్లి నెల రోజులు కావస్తున్నా, పొలాలను దున్నడం ప్రారంభించలేకపోయారు. సకాలంలో వర్షాలు వచ్చి ఉంటే ఈ పాటికే వరి నాట్లు జోరుగా సాగేవి. ఈ ఏడాది వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు నెల రోజుల ముందే వరి నార్లు పోశారు. అయితే, నాట్లు వేసే దశకు చేరుకున్నా ఆశించిన వర్షాలు లేకపోవడంతో దున్నకాల పనులు నిలిచిపోయాయి. దీంతో వరి, పత్తి, కంది, పెసర వంటి ప్రధాన పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత రెండేళ్లుగా ఆశించిన వర్షపాతం లేకపోవడం, వరి సాగు విస్తీర్ణం విపరీతంగా పెరగడంతో రాష్ట్రంలో నీటి వినియోగం భారీగా పెరిగింది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. మే చివరి వారంలో కురిసిన వర్షాలకు రైతులు సంతోషపడి సాగుకు సిద్ధమైనప్పటికీ, జూన్ నెలలో వర్షాలు ఆశించిన మేర కురవకపోవడంతో వరి, పత్తి, ఇతర పంటల సాగు నామమాత్రంగానే జరిగింది.