ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియకు గడువు లేదని.. నిరంతరాయంగా కొనసాగుతుందంటున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ప్రక్రియలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల నుంచి సభ్యుల్ని తొలగించేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గతంలో మృతి చెందిన వారు మాత్రమే కాదు, వలసల కారణంగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లిన సభ్యులను కూడా తొలగించేందుకు అవకాశం ఉంటుంది.రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్లు ఇలా ఉన్నాయి.1) వివాహం కారణంగా వేరే రాష్ట్రం/దేశానికి మైగ్రేట్ అయిన వారు2) ఉద్యోగరీత్యా వలస వెళ్లిన వారు3) చదువు నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిన వారు4) ఇతర సాంకేతిక కారణాలు'రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ప్రక్రియను గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా అమలు చేయొచ్చు. ప్రజలు సంబంధిత ఆధారాలు సమర్పించి తమ కార్డులోని సభ్యులను తొలగించవచ్చు' అని అధికారులు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ఇస్తారు. ఆగస్టు నెలలో వీటిని పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ కార్డులు ఏటీఎం కార్డులా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించారు. ఈ కొత్త రేషన్ కార్డు ముందు భాగంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉంటుంది. అలాగే రేషన్ కార్డు వెనుక వైపు కుటుంబ పెద్ద చిత్రం, రేషన్ దుకాణం సంఖ్య, ఇతర వివరాలు ఉంటాయి. ఈ-పోస్ యంత్రాల సహాయంతో కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబానికి సంబంధించిన సరకుల వివరాలన్నీ తెలుస్తాయి. ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త సభ్యుల చేరిక, సభ్యుల తొలగింపు, అడ్రస్ మార్పు, ఆధార్ సవరణ వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రేషన్ కార్డులో కొత్త వారిని చేర్చడానికి ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని చెబుతున్నారు అధికారులు. ఈ రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత వీఆర్వో లాగిన్‌కు వెళుతుంది. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తికి ఈకేవైసీ చేయాల్సిందే.. అనంతరం తహశీల్దార్ లాగిన్‌కు వెళతాయి.. అక్కడ ఆమోదం తెలిపితే రేషన్ కార్డు నంబరుకు సంబంధించిన సమాచారం లబ్ధిదారుడి మొబైల్‌కు వస్తుంది.