అరాచకం.. 45 ఏళ్ల వ్యక్తికి ఆరేళ్ల బాలికతో పెళ్లి.. 9 ఏళ్లు వచ్చాక కాపురానికి పంపాలన్న తాలిబన్లు

Wait 5 sec.

అఫ్గానిస్థాన్‌లో మహిళల పరిస్థితి అత్యంత దుర్బరంగా మారింది. తాజాగా, 45 ఏళ్ల వ్యక్తికి ఆరేళ్ల బాలికతో వివాహం జరిపించిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేసే అఫ్గన్ మీడియా Amu.tv నివేదిక ప్రకారం.. బాలిక తండ్రి డబ్బు కోసం తన కుమార్తెను 45 ఏళ్ల వ్యక్తికి విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ బాలికను పెళ్లాడిన వ్యక్తికి ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిపింది. దక్షిణ అఫ్గన్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వ స్పందించినట్లు తెలుస్తోంది. ఆ చిన్నారిని వెంటనే అతడితో వెళ్లకుండా అడ్డుకున్న తాలిబన్ అధికారులు.. తొమ్మిదేళ్ల వయసు వచ్చిన తర్వాత భర్త ఇంటికి పంపించాలని చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు తాలిబాన్ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. బాలిక తండ్రి, ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తిని తాలిబన్ అదుపులోకి తీసుకున్నా, ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి కేసులు నమోదు కాలేదు. బాలిక ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దే ఉన్నట్టు అఫ్గన్ డెయిలీ హషత్ ఇ సుభ్ నివేదించింది.వివాహం వెనుక 'వాల్వార్' సంప్రదాయంఈ వివాహం వాల్వార్ (Walwar) అనే సంప్రదాయం ఆధారంగా జరిగింది. ఇందులో వరుడు, వధువు వయస్సు, రూపం, చదువు, కుటుంబ స్థితిగతుల ఆధారంగా నగదు చెల్లిస్తాడు. ఇది భార్యకు ఖరీదు కట్టే ఆచారం. ఒకప్పుడు మనదేశంలో ఉండే కన్యాశుల్కానికి దీనికి దగ్గర పోలికలు ఉన్నాయి.వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాన్ని రేకెత్తించాయి. నెటిజన్లు, మానవహక్కుల కార్యకర్తలు ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది మానవతా విలువలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నారు.అఫ్గన్‌లో బాల్య వివాహాల స్థితి ముఖ్యంగా స్త్రీ విద్యను నిషేధించడమే దీనికి ప్రధాన కారణం. గత ప్రభుత్వ కాలంలో బాలికల కనీస వివాహ వయస్సు 16 ఏళ్లుగా ఉండేది. కాని ప్రస్తుతం ఆ చట్టం అమలులో లేదు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం అఫ్గనిస్తాన్‌లో బాల్యవివాహాలు 25% పెరిగాయి. చిన్న వయసులో గర్భధారణ 45% పెరిగింది. ఈ పరిస్థితులు అఫ్గనిస్థాన్‌లో బాలికలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, సామాజిక ఆంక్షలు వంటివాటికి గురవడానికి దారితీస్తున్నాయి.అంతర్జాతీయ సమాజం స్పందనమానవహక్కుల సంస్థలు, బాలికల హక్కుల కోసం పోరాటం చేస్తున్న వేదికలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. బాల్యవివాహాలు బాలికల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, ఇది ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన అని మండిపడుతున్నాయి. అంతర్జాతీయ సమాజం తక్షణ జోక్యం చేసుకుని అఫ్గన్ బాలికలను రక్షించాలని కోరుతున్నాయి.