గతేడాది 2,3 ఉద్యోగాలు మారారా? ITR ఫైలింగ్‌‌కు ఇవి తప్పనిసరి.. చిన్న మిస్టేక్‌తో నోటీసులొస్తాయ్..!

Wait 5 sec.

: ప్రస్తుతం చాలా మంది చాలా త్వర త్వరగా ఉద్యోగాలు మారుతుంటారు. కేరీర్ గ్రోత్ పేరుతో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీలోకి వెళ్తుంటారు. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ సంస్థల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. అందులో చాలా మంది ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు. అలా ఒకే కంపెనీలో కొనసాగే వారితో పోలిస్తే సరైన అవగాహన లేకుంటే సవాలుగా ఉంటుంది. మీరు కూడా గత ఆర్థిక సంవత్సరం 2024-25లో రెండు, మూడు ఉద్యోగులు మారారా? ఇప్పుడు ఐటీ రిటర్నులు ఫైల్ చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి. ఉద్యోగులు ఐటీ రిటర్నులు ఫైల్ చేయడంలో ముఖ్యంగా ఫారం 16, టీడీఎస్‌, గ్రాట్యుటీ లేదా పీఎఫ్ విత్ డ్రా వంటి అంశాలు కీలకంగా మారతాయి. చిన్న తప్పు చేసినా శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఉద్యోగం మారిపోయిన తర్వాత చాలా మంది ట్యాక్స్ పేయర్లు ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ నుంచే ఫారం 16 తీసుకుంటుంటారు. అది అతిపెద్ద తప్పిదంగా మారుతుంది. ఇంతకు ముందు పని చేసిన కంపెనీలోని జీతాన్ని మర్చిపోతుంటారు. దీంతో తక్కువ ఆదాయం కనిపిస్తుంది. కొత్త కంపెనీకి పాత ఆదాయం సమాచారం ఇవ్వరు. దీని కారణంగా ఆదాయం, టీడీఎస్ లెక్కల్లో తేడాలొస్తాయి. అందుకే గత ఆర్థిక ఏడాదిలో మీరు పని చేసిన కంపెనీలన్నింటి నుంచి ఫారం 16 తీసుకోవడం తప్పనిసరి. అన్ని కంపెనీల ఫారం 16లల్లో చూపించిన ఆదాయాలను కలిపి మొత్తం ఎంత ఆదాయం వచ్చిందో చూసుకోవాలి. ఫారం 26ఏఎస్, వార్షిక సమాచార డాక్యుమెంట్ (AIS)లోని లెక్కలను సరిపోల్చుకోవాలి. అన్ని వివరాలు ఒకేసారి చెక్ చేసి అన్ని సరిగా ఉంటే ఐటీ రిటర్నులు సమర్పించాలి. దీంతో ఎలాంటి తప్పులు లేకుండా ఉంటుంది. నోటీసులు తప్పించుకోవచ్చు. పాత పన్ను విధానం ఎంచుకున్న వారు సెక్షన్ 80సీ, 80డీ వంటి మినహాయింపుల రెండు కంపెనీల్లో క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైలింగ్ చేసేటప్పుడు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగాలు మారిన సమయంలో ఫారం 16, ఫారం 26ఏఎస్, ఏఐఎస్‌లోని ఆదాయాల వివరాల్లో వ్యత్యాసాలు ఉండేందుకు ఆస్కారం ఉంది. ఇలాంటి అసమానతలు గుర్తించినప్పుడు వెంటనే కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి టీడీఎస్ రిటర్ను సవరించాలని అర్జి పెట్టుకోవాలి. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు 26ఏఎస్‌లోని టీడీఎస్ వివరాలే ఆధారంగా తీసుకోవాలి. ఉద్యోగం మారినప్పుడు అందుకున్న అదనపు ప్రయోజనాలనూ పేర్కొనాలి. ఇక ఒకటికి మించి ఆదాయ మార్గాలు ఉన్న వారు కొన్నిసార్లు ఐటీఆర్ 1 కి బదులుగా ఐటీఆర్ 2 లేదా ఐటీఆర్ 3 ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఎంత ఆదాయం ఉంది, ఎలాంటి ఫారం ఎంచుకోవాలి అని తెలుసుకోవాలి. సరైన ఫారం ఎంచుకుని రిటర్నులు ఫైల్ చేయాలి. లేదంటే రిజెక్ట్ అవుతుంది. పన్ను నోటీసులు అందుతాయి.