తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ అందించే లక్ష్యంతో కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, అర్హులైన ఎస్సీ, ఎస్టీ రైతులకు సోనాలి జాతి కోడి పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ పథకం కోసం విశ్వవిద్యాలయానికి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల కింద కేటాయించిన నిధులను వినియోగిస్తున్నారు. అధికంగా నివసించే ప్రాంతాలలో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ జరుగుతోంది.గురువారం (జులై 10) మహబూబాబాద్ జిల్లాలోని మల్యాల దర్యా తండాలలో ఈ కోడి పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం డీన్ జె. చీనా నాయక్ ప్రారంభించారు. మల్యాల, దర్యా తండాల్లో మొత్తం 300 ఎస్సీ, 100 ఎస్టీ కుటుంబాలకు చెందిన రైతులకు కోడి పిల్లలను అందజేశారు. ప్రతి రైతు కుటుంబానికి 6 వారాల వయస్సున్న 10 సోనాలి జాతి కోడి పిల్లలు (రెండు పుంజులు, ఎనిమిది పెట్టలు) చొప్పున పంపిణీ చేస్తున్నారు. తొలి విడతలో మహబూబాబాద్, ములుగు, మరియు నల్గొండ జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుందని అధికారులు తెలిపారు. రెండో విడతలో రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా ఈ పథకాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు.సోనాలి జాతి కోడి పిల్లలు వేగంగా పెరుగుతాయి. కేవలం 60 రోజుల్లో 2-3 కిలోల బరువు పెరుగుతాయని అంచనా. అంతేకాకుండా పెట్టలు రెండో నెల నుంచే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. దీనివల్ల రైతులు గుడ్లు, మాంసం అమ్మకాల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించడంలో ఎంతగానో సహాయపడుతుందని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ దండా రాజిరెడ్డి తెలిపారు. కోళ్ల పెంపకం ద్వారా రైతులు స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.