యూట్యూబర్ నందు అలియాస్ రమా నందనకు షాక్.. ఏపీలో కేసు నమోదు..

Wait 5 sec.

ప్రముఖ చిక్కుల్లో పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నందు కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూకే వీసా రెన్యువల్ పేరుతో తనను 15 లక్షల రూపాయల మేరకు మోసం చేశారంటూ బాధితుడి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు నటి రమా నందన, ఆమె భర్త మధుకర్, మధుకర్ తండ్రిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వెస్ట్ ఇబ్రహీంపట్నంకు చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి యూకేలో ఉండేవారు. అయితే తన యూకే వీసా గడువు తీరిపోతూ ఉండటంతో యూకే వీసా రెన్యువల్ కోసం డెస్టినీ కన్సల్టెన్సీ సంస్థను శివక్రాంతి కుమార్ ఆశ్రయించారు. దీంతో భారతదేశంలో ఉన్న తమ బ్రాంచ్‌లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ చేస్తామని కన్సల్టెన్సీ నిర్వాహకులు చెప్పినట్లు శివక్రాంతి కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి మాటలు నమ్మి రూ. 15 లక్షల వరకు చెల్లించారు. అయితే నెలలు గడుస్తున్నా కూడా వీసా రాకపోవటం, నిందితుల నుంచి సరైన సమాధానం లేకపోవటంతో శివక్రాంతి కుమార్ తాను మోసపోయిన విషయం గ్రహించి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం ఎస్ఐ రాజు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన, గుంటూరులో ఉండే మధుకర్ తండ్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజు వెల్లడించారు.నందూస్ వరల్డ్ పేరుతో వీడియోలు చేస్తూ రమా నందన, మధు ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిపై ఇటీవలి కాలంలో వీసా స్కామ్ ఆరోపణలు వచ్చాయి. వీసాల పేరు చెప్పి కోట్లలో వసూలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై రమా నందన క్లారిటీ కూడా ఇచ్చారు. తమ కుటుంబంపై వ్యక్తిగత కక్షతో కొంతమంది డబ్బులు ఇచ్చి ఇలాంటి నెగటివ్ ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. యూకే నుంచి భారతదేశానికి పారిపోయిన ముగ్గురు.. తమపై ఇలా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనకు, తన భర్తకు భారతదేశంలో ఎలాంటి కంపెనీలు లేవని.. తమ పేర్లు చెప్పి కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారని వీడియోలో చెప్పుకొచ్చారు. తాజాగా వీరిపై కేసు నమోదు కావటం గమనార్హం.