తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రూ.7,597 కోట్ల రోడ్ ప్రాజెక్టు.. ఆ ప్రాంతాలకు మహర్దశ

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణతో పాటుగా ఒడిశా, బిహార్‌ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తరణతో పాటుగా కొత్త రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణకు సంబంధించి ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల జాతీయ రహదారి (జాతీయ రహదారి 63) విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేషనల్ హైవేను హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో విస్తరించనున్నారు. అలాగే జగిత్యాల-కరీంనగర్ హైవే (జాతీయ రహదారి 563) విస్తరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జాతీయ రహదారిని బీవోటీ పద్ధతిలో విస్తరించనున్నారు. ఈ రెండు జాతీయ రహదారులను 190 కిలోమీటర్ల మేరకు నాలుగు వరుసలగా విస్తరించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.7,597 కోట్లు ఖర్చు చేయనుంది. జూన్ నెల ప్రారంభంలో తెలంగాణకు భారీ కానుక.. బండి సంజయ్ మరోవైపు జూన్ నెల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీ కానుక ప్రకటించిందని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం.. ఉత్తర తెలంగాణ కోసం రూ.7597 కోట్లతో రహదారి ప్రాజెక్టును మంజూరు చేసిందని తెలిపారు. NH-63, NH-563లను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. రూ.2472 కోట్లతో ఆర్మూర్ - జగిత్యాల మధ్య 63.6 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. అలాగే జగిత్యాల - మంచిర్యాల మధ్య 68.3 కిలోమీటర్ల మేరకు రహదారిని నాలుగు వరుసలుగా విస్తరిస్తారని.. ఇందుకోసం రూ. 2731 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. రూ.2395 కోట్లతో జగిత్యాల - కరీంనగర్ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు తెలిపారు. రాబోయే దశాబ్దాల పాటు తెలంగాణ అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా నిలిచేలా.. మౌలిక సదుపాయాల రంగంలో ఇదొక విప్లవాత్మకమైన ముందడుగుగా బండి సంజయ్ అభివర్ణించారు. తెలంగాణకు ఈ చరిత్రాత్మక కానుకను అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలియజేశారు. నా కరీంనగర్. నా తెలంగాణ. గర్వంతో ముందుకు సాగుతోందంటూ బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు.