తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై తన రాజకీయ భవిష్యత్తుపై శుక్రవారం (జూన్ 5) కీలక ప్రకటన చేయబోతున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సోషల్ మీడియాలో అన్ని విషయాలను పంచుకుంటానని తెలిపారు. ‘‘రేపు మధ్యాహ్నం 12 గంటలకు నా ఆలోచనలను పంచుకోవడానికి, మనసు విప్పి మాట్లాడటానికి, సోషల్ మీడియాలో మీ అందరితో సంభాషించడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నామలై తన పోస్ట్‌లో పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఆయన ప్రయాణంపై జరుగుతోన్న ఊహాగానాలకు సమాధానం లభిస్తుందని భావిస్తున్నారు.అన్నామలై బీజేపీని వీడటం దాదాపు ఖాయమైందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్ 2న ఢిల్లీకి వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. అమిత్ షాతో దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన భేటీ వివరాలు అధికారికంగా వెల్లడికానప్పటికీ.. రాజీనామా నిర్ణయంపై పునరాలోచించాలని అన్నామలైకు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన లేవనెత్తిన అంశాలపై త్వరలోనే చర్చిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన సుదీర్ఘమైన రాజీనామా లేఖను అందజేశారు. ఐదు పేజీల లేఖలో తన సమస్యలు, ఇబ్బందులను ఏకరవుపెట్టినట్టు తెలుస్తోంది.విశ్వసనీయ నివేదికల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే బీజేపీని వీడాలని ఆయన నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకేతో తిరిగి పొత్తును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దళపతి జోసెఫ్ విజయ్ ఎంట్రీ ద్వారా తమిళనాడులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని అన్నామలై బలంగా నమ్ముతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.బీజేపీ నుంచి బయటకొచ్చిన తర్వాత ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించి, భవిష్యత్తులో దానిని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచనలో అన్నామలై ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఏర్పాటు ఊహగానాలపై ఆయన స్పందించిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి వెళ్లే ముందు చెన్నై విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దయచేసి వేచి ఉండంది.. మరో రెండు రోజుల్లో అన్నీ కూర్చుని మాట్లాడుకుందాం’ అని వైఖరిని స్పష్టం చేశారు.